Konda Surekha : వరంగల్ తూర్పులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మంత్రి కొండా సురేఖ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆవాసం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆమె తెలిపారు. 15 సంవత్సరాల విరామం తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణం జరగడం ఎంతో గర్వకారణమని, ఇందుకు అనుకూలంగా ప్రభుత్వం రూ.22,500 కోట్లు వెచ్చించి నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్నది తమ ధ్యేయమని పేర్కొన్నారు. కొండా సురేఖ మాట్లాడుతూ, తాను టీఆర్ఎస్ ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గ శాసన సభ్యురాలిగా ఉన్నప్పుడు కూడా ఇళ్ల కోసం కృషి చేసినప్పటికీ, అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదని విమర్శించారు. “ఇప్పటికైనా ఇల్లు నిర్మించడం బీఆర్ఎస్ చేతకాదని ప్రజలకు అర్థమవుతోంది. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Daggubati Purandeswari: పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం!
ఇటీవల వరంగల్ తూర్పులో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడిన ఆమె, “నేను శాసనసభ్యురాలిగా పనిచేసిన సమయంలో చేసిన అభివృద్ధే ఇప్పటికీ ప్రజలకు కనిపిస్తోంది. గత ఎమ్మెల్యే ఏం చేశాడో ప్రజలే చెబుతున్నారు” అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి కూడు, గుడ్డా, నీడ కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొదటి విడతలో అవకాశం రాకపోయినవారికి రెండవ విడతలో అవకాశం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
అంతేకాదు, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆమె గుర్తుచేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుపైనే మంజూరు చేయనున్నట్లు తెలిపారు. చివరిగా, తూర్పు నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలందరికీ అండగా నిలబడి, అందరికీ సొంతింటి కల నెరవేర్చే దిశగా తాను పూనుకుంటానని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు.