USA: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారీ డ్రగ్స్ రవాణా బయటపడింది. ఇండియానా స్టేట్ పోలీస్ అధికారులు సాధారణ ట్రాఫిక్ తనిఖీల్లో భాగంగా ఆపిన ఓ లారీ నుంచి సుమారు 309 పౌండ్ల (140 కిలోల) కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 7 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో భారతీయులైన ఇద్దరు ట్రక్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారు కాలిఫోర్నియాకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30). వీరిద్దరూ భారతీయ మూలాలు కలవారని అమెరికా అధికారులు తెలిపారు. ఫాక్స్59 టీవీ ఛానల్ కథనం ప్రకారం.. ఇండియానాలోని పుట్నమ్ కౌంటీలో ఇంటర్‌స్టేట్-70 రహదారిపై లారీని ఆపి తనిఖీ చేయగా ఈ భారీ డ్రగ్స్ దొరికాయి.
READ MORE: Cheekatilo : శోభిత ధూళిపాల ‘చీకటిలో’ ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
లారీ డ్రైవింగ్‌లో అనుమానాస్పదంగా లైన్ తప్పుతూ నడపడం, వాహనంలో సాంకేతిక లోపాలు కనిపించడంతో తనిఖీలు చేపట్టారు. తొలుత వాహనం ఖాళీగా ఉందని డ్రైవర్లు చెప్పినా, డ్రగ్స్ స్నిఫర్ డాగ్ హెచ్చరిక ఇవ్వడంతో పూర్తిగా తనిఖీ చేశారు. లారీ స్లీపర్ బెర్త్‌లో దుప్పటితో కప్పిన కార్డ్‌బోర్డ్ బాక్సుల్లో కొకైన్‌ను దాచి ఉంచినట్లు గుర్తించారు. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) వివరాల ప్రకారం.. ఈ ఇద్దరూ అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారు. గుర్‌ప్రీత్ సింగ్ 2023లో, జస్వీర్ సింగ్ 2017లో అక్రమంగా అమెరికాలోకి వచ్చారు. జస్వీర్ సింగ్‌పై గతంలో దొంగతనానికి సంబంధించిన కేసు కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరిపైనా ICE డిపోర్టేషన్ హోల్డ్ విధించారు.
READ MORE: YS Jagan Slams Chandrababu: పరిశ్రమల పేరుతో చంద్రబాబు చేసేవన్నీ స్కాములే..
స్వాధీనం చేసుకున్న కొకైన్ పరిమాణం లక్ష 13 వేల మందికిపైగా అమెరికన్ల ప్రాణాలు తీసేంత ప్రమాదకరమని DHS పేర్కొంది. ఈ ఘటన అక్రమ వలసలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు, ఫెడరల్–స్టేట్ ప్రభుత్వాల మధ్య విధాన విభేదాలపై పెద్ద చర్చకు దారితీసింది. కాలిఫోర్నియా ప్రభుత్వం జారీ చేసిన ట్రక్ డ్రైవింగ్ లైసెన్సులపై కూడా వివాదం చెలరేగింది. అక్రమ వలసదారులకు వేల సంఖ్యలో లైసెన్సులు ఇచ్చినట్లు ఆడిట్‌లో తేలడంతో, కాలిఫోర్నియాకు ఇవ్వాల్సిన 160 మిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను అమెరికా రవాణా శాఖ నిలిపివేసింది. మరోవైపు.. ఇండియానా గవర్నర్ మైక్ బ్రౌన్ ఈ ఆపరేషన్‌ను ప్రశంసిస్తూ, డ్రగ్స్ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధాన రహదారుల ద్వారా జరుగుతున్న మత్తు పదార్థాల రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.