సార్వత్రిక ఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు విడతల పోలింగ్, కౌంటింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై చర్చించారు.
అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఇక సార్వత్రిక ఎన్నికలపై వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమికి చెందిన పార్టీలు నిర్ణయించినట్లు కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్‌పర్సన్ పవన్ ఖేడా ప్రకటించారు. టీవీ చర్చల్లో పాల్గొనబోమని ఖేడా శుక్రవారం ప్రకటించారు. ఒకరోజు తర్వాత స్వరం మారింది. శనివారం మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం తర్వాత సీనియర్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇక సమావేశంలో జూన్ 4న ఓట్ల లెక్కింపు వేళ అనుసరించాల్సిన వ్యూహాలు, కౌంటింగ్ సన్నాహాలు, భవిష్యత్తు కార్యాచరణపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఫారం 17సీ, ఈవీఎంల విషయంలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఖర్గే తెలిపారు. శక్తివంచన లేకుండా తామంతా లోక్‌సభ ఎన్నికల్లో పోరాడామని.. ప్రజలు తమకు మద్దతు ఇచ్చారని భావిస్తున్నట్లు చెప్పారు. సానుకూల ఫలితాలు వస్తాయన్న విశ్వాసంతో ఉన్నట్లు ఖర్గే పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూటమికి 295కుపైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ. వేణుగోపాల్ (INC), అఖిలేష్ యాదవ్ (SP), శరద్ పవార్, జితేంద్ర అవద్ (NCP), అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా (AAP) , టీఆర్. బాలు (DMK), తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్ (RJD), చంపై సోరెన్, కల్పనా సోరెన్ (JMM), ఫరూక్ అబ్దుల్లా (J&K NC), డి. రాజా (CPI), సీతారాం ఏచూరి (CPIM), అనిల్ దేశాయ్ శివసేన ( UBT), దీపాంకర్ భట్టాచార్య (CPI(ML), ముఖేష్ సహాని (VIP) పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో చివరి దశ పోలింగ్ నేపథ్యంలో సమావేశానికి హాజరుకాలేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమాచారం అందించారు. వ్యక్తిగత కారణాలతో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ హాజరుకాలేదు.