Rohit Sharma, Virat Kohli likely to surpass Sachin Tendulkar in Asia Cup 2023: క్రికెట్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 సమరం కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఆగష్టు 30న పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్లు టోర్నీ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక దాయాదులు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబరు 2న జరగనుంది. ఈ సారి ఎలా అయినా ఆసియా కప్‌ని పట్టేసుకోవాలని దాయాది జట్లు చూస్తున్నాయి. దాంతో ఇరు జట్ల మధ్య ఎప్పటిలానే మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. అయితే ఆసియా కప్ 2023 నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు ముంగిట నిలిచారు.
వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 23 మ్యాచ్‌ల్లో 51.10 సగటుతో 2 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో 971 పరుగులు చేశాడు. భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ 21 ఇన్నింగ్స్‌లలో 46.56 సగటుతో 745 పరుగులు (ఒక సెంచరీ మరియు ఆరు అర్ధ సెంచరీలు) చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ కంటే 226 పరుగులు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఈ ఎడిషన్‌లో రోహిత్ చెలరేగితే సచిన్ రికార్డు బద్దలవుతుంది.
ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 2014లో వన్డే ఆసియా కప్‌లో చివరిసారి ఆడిన కోహ్లీ కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లో 613 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో విరాట్ మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ చేశాడు. విరాట్ ఆల్‌టైమ్ వన్డే అత్యధిక స్కోరు 183 పాకిస్థాన్‌పై ఆసియా కప్‌లో సాధించాడు. ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో భారత క్రికెటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచేందుకు కోహ్లీకి ఇంకా 358 పరుగులు అవసరం.
Also Read: Red Card in Cricket: క్రికెట్‌లో తొలిసారి రెడ్ కార్డ్.. మొదటి బాధిత క్రికెటర్ ఎవరంటే?
సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు అవకాశం ఉంది. ఫామ్‌ను కొనసాగిస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు ఈసారి సచిన్ రికార్డు బద్దలు కొడతారు. ఆసియా కప్‌లో భారత్ మొత్తం 6 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. గ్రూప్ స్టేజ్‌లో రెండు మ్యాచ్‌లు, సూపర్ ఫోర్ రౌండ్‌లో 3 మ్యాచ్‌లు (అంచనా), ఫైనల్ మ్యాచ్ (అంచనా) భారత్ ఆడే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ తలపడనున్నాయి.