ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో అపజయమే లేని భారత్.. ఆదివారం జరిగే ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు భారత్ చేతిలో ఓడిన పాక్.. ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా.. పాకిస్థాన్‌ను మూడోసారి చిత్తుచేసి టైటిల్ పట్టేయాలని బావిస్తోంది. అయితే ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో శుక్రవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో అభిషేక్ ఫీల్డింగ్ చేయలేదు. అతడి స్థానంలో రింకూ సింగ్ మైదానంలోకి వచ్చాడు. తొడ కండరాలు పట్టేయడంతోనే అభిషేక్ ఫీల్డింగ్ చేయలేదని తెలుస్తోంది. తొలి ఓవర్ వేసిన హార్దిక్ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు. ఆ తర్వాత అతడు బౌలింగ్‌కు రాలేదు. ఇక మ్యాచ్ చివర్లో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టేందుకు ఎగిరిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు సైతం కండరాలు పట్టేసాయి. దాంతో తిలక్ కూడా మైదానం వీడాడు.
Also Read: NTR-Kantara: టైగర్ రోర్స్.. ఒక్క ఈవెంట్, ఎన్నో అప్డేట్స్!
ఆదివారం పాకిస్థాన్‌తో ఫైనల్‌లో భారత్ ఆడాల్సి ఉంది. ఈ సమయంలో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు దూరమైతే భారత జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది. అయితే బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఓ శుభవార్త చెప్పాడు. ఆటగాళ్లకు అయిన గాయాలు పెద్ద సమస్య కాదని చెప్పడంతో ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. శనివారం ఫిట్‌నెస్‌పై వారు మ్యాచ్ ఆడేది లేనిది తెలియరానుంది. ఫైనల్‌కు తప్పకుండా ముగ్గురు అందుబాటులో ఉండాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.