Sarfaraz Khan traveled 16 thousand kilometers for Practice: రాజ్‌కోట్ టెస్టులో అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరినీ ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 66 బంతుల్లో 62 రన్స్ చేసిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో 72 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్పిన్నర్లను సర్ఫరాజ్ సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అరంగేట్రం మ్యాచ్ అయినా బౌండరీలు బాదుతూ స్వేచ్ఛగా ఆడాడు. అయితే స్పిన్‌లో సర్ఫరాజ్ ప్రదర్శన గాలివాటమేమీ కాదు. అతడి 15 ఏళ్ల కఠిన శ్రమకు ఫలితం.
తండ్రి నౌషాద్ ఖాన్ పర్యవేక్షణలో సర్ఫరాజ్ ఖాన్ ప్రతి రోజూ 500 బంతులు ఎదుర్కొన్నాడు. అలా అతడు తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నాడు. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయంలో అవలంబించిన ప్రణాళిక.. ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్ట్‌లీ, జో రూట్, రెహాన్ అహ్మద్‌ల బౌలింగ్‌లో మంచి ఫలితాలను ఇచ్చింది. ‘ముంబై మైదానాల్లో ఆఫ్, లెగ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రతి రోజూ 500 బంతులు ఎదుర్కోవడం వల్లే రాజ్‌కోట్‌లో సర్ఫరాజ్ ఖాన్ స్పిన్నర్లను బాగా ఎదుర్కోగలిగాడు’అని ఓ కోచ్ తెలిపాడు.
Also Read: Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
‘కరోనా సమయంలో ప్రాక్టీస్ కోసం సర్ఫరాజ్ ఖాన్ 16 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ముంబై నుంచి అమ్రోహా, మొరాదాబాద్, మీరట్, కాన్పూర్, మథుర, దెహ్రాదూన్‌లకు వెళ్లి బంతి స్క్వేర్‌గా టర్నయ్యే అకాడమిలలో సాధన చేశాడు. కొన్ని బంతులు ఎక్కువ బౌన్స్ అయితే.. ఇంకొన్ని తక్కువ ఎత్తులో వచ్చేవి’ అని సదరు కోచ్ చెప్పాడు. భువనేశ్వర్ కుమార్ కోచ్ సంజయ్, మొహ్మద్ షమీ కోచ్ బబ్రుద్దీన్, కుల్దీప్ యాదవ్ కోచ్ కపిల్ దేవ్ పాండే, గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ కూడా స్పిన్‌లో సర్ఫరాజ్ బాగా ఆడడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇక మూడో టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన అతడు నాలుగో టెస్టులో రాణించాలని చూస్తున్నాడు.