Rohit Sharma React on England Bazball Cricket: ఇంగ్లండ్ ప్లేయర్స్ బజ్‌బాల్ క్రికెట్ ఆడినా.. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండని భారత బౌలర్లకు తాను చెప్పానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్ నాణ్యమైన క్రికెటింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడని, యశస్వి జైస్వాల్ కెరీర్‌ను అత్యుత్తమంగా మొదలుపెట్టాడని ప్రశంసించాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 434 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన చిత్తు చేసింది. దాంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘టెస్టు క్రికెట్ ఆడుతున్నప్పుడు 2-3 రోజులను దృష్టిలో పెట్టుకోకూడదు. 5 రోజుల వరకు మ్యాచ్‌ను పొడిగించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాం. ఇంగ్లండ్ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో బాగా ఆడి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. మా జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ప్రత్యర్థి బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్న సమయంలో మా బౌలర్లకు ఒకటే చెప్పాను. ఇంగ్లండ్ ప్లేయర్స్ బజ్‌బాల్ క్రికెట్ ఆడినా మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండని చెప్పాను. మూడో రోజు మా బౌలర్లు పుంజుకున్న తీరు అద్భుతం’ అని అన్నాడు.
Also Read: WhatsApp Channels: వాట్సప్ ఛానెల్స్‌లో కొత్త ఫీచర్!
‘మేము లెఫ్ట్-రైట్ కాంబోని కొనసాగించి మంచి ఫలితాలు సాధించాం. భారతదేశంలో టాస్ గెలవడం ఎంత ముఖ్యమో మాకు తెలుసు. మా బౌలర్లు బౌలింగ్ చేసిన విధానం చాల బాగుంది. విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. రవీంద్ర జడేజా తన అనుభవంను ఉపయోగించాడు. బ్యాటింగ్‌లోనూ కీలక పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ నాణ్యమైన క్రికెట్ షాట్లతో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ కెరీర్‌ను అత్యుత్తమంగా మొదలుపెట్టాడు. వైజాగ్‌లో జైస్వాల్ గురించి చాలా మాట్లాడాను. అంతకంటే అతడి గురించి ఎక్కువ చెప్పలేను. జైస్వాల్ ఇంకా బాగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఇద్దరు (సర్ఫరాజ్, జైస్వాల్) యువకులు మాకు కావలసిన ఆధిక్యాన్ని అందించారు. తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు’ అని రోహిత్ శర్మ చెప్పాడు.