Rohit Sharma React on Ben Duckett Bazball Comments: ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెటైర్లు వేశాడు. బహుశా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటను బెన్ డక్కెట్ చూసుండడని సెటైర్ వేశాడు. అసలు ఈ బాజ్‌బాల్ అంటే ఏంటో తనకు ఇప్పటికీ అర్ధం కావడంలేదన్నాడు. తాను స్కూల్లో పెద్దగా చదవుకోపోయినా.. క్రికెట్‌లో మాత్రం ప్రత్యర్థుల ఆటతీరును బాగా చదువుతానని రోహిత్ తెలిపాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటను చూసి భారత్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నాడని బెన్ డక్కెట్ అన్నాడు. ఆ వ్యాఖ్యలపై హిట్‌మ్యాన్ తనదైన శైలిలో స్పందించాడు.
యశస్వి జైస్వాల్ ఆటను చూసే ఇంగ్లండ్ భయపడుతోందని, యశస్వి కంటే దూకుడుగా ఆడే బ్యాటర్ భారత జట్టులో ఉన్నాడని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోహిత్ శర్మ.. బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. ‘మా జట్టులో రిషబ్ పంత్ అనే వ్యక్తి ఉన్నాడు. బహుశా బెన్ డకెట్ అతను ఆడటం చూసి ఉండడు’ అని హిట్‌మ్యాన్ అన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. పంత్ డేంజర్ బ్యాటర్ అని రోహిత్ చెప్పకనే చెప్పాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్.. ప్రస్తుతం కోలుకుని ఐపీఎల్ 2024 కోసం సిద్దమవుతున్నాడు.
Also Read: Ranji Trophy 2024: మధ్యప్రదేశ్‌పై ఉత్కంఠ విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ!
‘బాజ్‌బాల్ అంటే ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు. ఇంగ్లండ్ మాత్రం గతంలో కంటే మెరుగ్గా ఆడుతోంది. నేను స్కూల్లో పెద్దగా చదవుకోలేదు కానీ.. క్రికెట్‌లో మాత్రం ప్రత్యర్థుల ఆట తీరును బాగా చదువుతా. ఓ బ్యాటర్, కెప్టెన్‌గా నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ముందుంటా. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్ ఒత్తిడి చేసినా.. మేం ప్రశాంతంగా ఉన్నాం. తిరిగిపుంజుకోవడానికి ఏం చేయాలో అదే చేశాం. వరుసగా మూడు విజయాలు అందుకున్నాము. ధర్మశాల పిచ్ గురించి చర్చ అనవసరం. పిచ్ ఎలా ఉన్నా.. మ్యాచ్ గెలవడమే మా లక్ష్యం. ధర్మశాలలో నేను ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. జట్టులో ఉన్న కొద్దిమందికే ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇంకా తుది జట్టును ఖరారు చేయలేదు. ధర్మశాల మైదానం నా హోమ్ గ్రౌండ్ ఫీలింగ్‌ను కలిగిస్తోంది’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.