Camera, Laptop and OutSide Food not allowed in Uppal Stadium: గురువారం ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులను ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఉన్నాయని, పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతామని చెప్పారు. పీక్ హవర్స్‌లో మైదానానికి ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని రాచకొండ సీపీ పేర్కొన్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా గురువారం (జనవరి 25) నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు.
రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ… ‘ఉదయం 6.30 నుండి ప్రేక్షకులను ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిస్తాం. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఉన్నాయి. మా పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతాం. పీక్ హవర్స్‌లో ప్రేక్షకులు వస్తారు కాబట్టి.. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. 1500 మంది పోలీసులతో మ్యాచ్‌కి బందోబస్తు ఏర్పాటు చేశాం. ఆక్టోపస్ బలగాలు కూడా ఉంటాయి. 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయి. స్టేడియంలోకి కెమెరాలు, ల్యాప్ టాప్స్, బ్యాగ్స్, సిగెరెట్స్, హెల్మెట్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, పవర్ బ్యాంక్స్, బయటి ఫుడ్ అనుమతించం’ అని తెలిపారు.
Also Read: IND vs ENG: ఇంగ్లండ్ బౌలింగ్, బ్యాటింగ్‌పై పెద్జగా దృష్టి సారించను: రోహిత్
‘డీసెంట్ క్రౌడ్ బిహేవియర్ ఉండాలి. వెండర్స్‌ని కూడా వెరిఫై చేసిన తర్వాతే పాసులు జారీ చేశాం. ఒకసారి లోపలికి వెళ్లి బయటకి వస్తే.. తిరిగి స్టేడియం లోపలికి అనుమతించం. మ్యాచ్‌కి వచ్చే వారికి సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. బ్లాక్ టికెట్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంతో పాటు హైదరాబాద్ గౌరవానికి భంగం కలగకుండా ఏర్పాట్లు చేసాం. ప్రేక్షకులు కూడా క్రమశిక్షణతో ఉండాలి’ అని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు.