కెప్టెన్ కావడం వల్లే రోహిత్ శర్మ తుది జట్టులో ఉంటున్నాడని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కెప్టెన్‌గా లేకపోతే ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్ స్థానం ప్రశ్నార్థకంగా మారేదన్నాడు. హిట్‌మ్యాన్ బ్యాటర్‌గా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. రోహిత్ గత కొన్ని నెలలుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీ మినహా రాణించలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో కనీసం 20, 30 పరుగులు కూడా చేయట్లేదు.
గత 15 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ సగటు 10.93 ఉందంటే.. అతని ఫామ్ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న రోహిత్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. హిట్‌మ్యాన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ అనంతరం రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. తాజాగా హిట్‌మ్యాన్ ఫామ్‌పై ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్‌లో స్పందిస్తూ విమర్శలు కురిపించాడు. రోహిత్ కెప్టెన్ కాకపోతే ఇప్పుడు జట్టులో ఉండేవాడు కాదన్నాడు.
‘అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు చేసిన రోహిత్.. ఇప్పుడు రన్స్ చేయలేక తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. హిట్‌మ్యాన్ ఫామ్ అందుకోలేకపోతున్నాడు. కెప్టెన్ కాబట్టి తుది జట్టులో ఆడుతున్నాడు. రోహిత్ కెప్టెన్ కాకపోతే జట్టులో ఉండేవాడు కాదు. హిట్‌మ్యాన్ లేకపోతే టీమిండియాకు ఒక తుది జట్టు ఉండేది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్ ఆడేవారు. నిజం మాట్లాడుకుంటే.. రోహిత్ బ్యాటర్‌గా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. ఇది పరిగణనలోకి తీసుకుంటే అతడికి తుది జట్టులో చోటు ఉండకూడదు’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.