జై గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బొప్పా మోరియా.. గణేషుడి పండగ వచ్చిందంటే గల్లీ గల్లీకి వినపడే స్లోగన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేషుడు అంటే స్పెషల్. ఎందుకంటే అక్కడ ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటాడు. అయితే ఈ ఏడాది కూడా భక్తులను అనుగ్రహించేందుకు బొజ్జ గణపయ్య సిద్ధమవుతున్నాడు. గతేడాది నిబంధనలకు అనుగుణంగా.. ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి మట్టితో తయారు చేయనున్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేషుణ్ణి నిర్వహకులు రూపొందిస్తున్నారు.
Read Also: Minister Harish Rao: హెల్త్ సిటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి..
అందుకు సంబంధించి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి ఇవాళ (బుధవారం) అంకురార్పణ చేశారు. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ ఏర్పాటు కోసం కర్రపూజను సాయంత్రం 5 గంటలకు నిర్వహించారు. ఈ పూజతోనే గణనాథుడి విగ్రహ నిర్మాణ పనిని ప్రారంభించారు. ఈ ఏడాది ఖైరాతాబాద్ లో 51 అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అలాగే వచ్చేవారం వినాయకుడికి సంబంధించిన పోస్టర్ ను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
Read Also: Ramakrishna : రమ్యకృష్ణ కు ఈ టాలెంట్ కూడా ఉందా?
పూజా కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు, దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు. గతేడాది మట్టితో తయారు చేసిన 50 అడుగుల ఎత్తైన శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ప్రతిష్టించారు. ఈసారి ఇంకో అడుగు పెంచుతూ.. 51 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి భారీ గణనాథుడుని చూసేందుకు భక్తులు వేచిచూడాల్సిందే..