ఎర్రమట్టి కోర్టు కింగ్, లేడీ నాదల్ ఇగా స్వైటెక్ విజయ పరంపరకు తెర పడింది. ఫ్రెంచ్ ఓపెన్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన స్వైటెక్‌కు అరీనా సబలెంకా షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా 7-6 (7-1), 4-6, 6-0తో స్వైటెక్‌ను ఓడించింది. హ్యాట్రిక్ టైటిళ్లు గెలిచిన స్వైటెక్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసిన సబలెంకా.. రొలాండ్ గారోస్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం కొకో గాఫ్‌తో సబలెంకా తలపడనుంది. రొలాండ్ గారోస్‌లో మూడేళ్ల తర్వాత కొత్త ఛాంపియన్ రాబోతోంది.
క్వార్టర్స్‌లో ఆరోసీడ్ నొవాక్ జకోవిచ్ 4-6, 6-3, 6-2, 6-4తో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ని ఓడించాడు. నొవాక్ తొలి సెట్ ఓడినా.. తర్వాతి మూడు సెట్లు సొంతం చేసుకుని మ్యాచ్ గెలిచాడు. మూడు గంటలకు పైగా సాగిన పోరులో జకోవిచ్ 6 ఏస్‌లు, 42 విన్నర్లు కొట్టాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో జకోవిచ్ సెమీఫైనల్ చేరడం ఇది 52వ సారి. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ యానెక్ సినర్‌తో జకో తలపడనున్నాడు. సినర్‌తో గత అయిదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో జకోవిచ్ ఓడిపోవడం విశేషం. మరో సెమీస్‌లో అల్కరాస్, ముసెట్టి తలపడనున్నారు.