బీహార్‌లోని భోజ్‌పూర్‌లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త టీ చేయమని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో భర్త విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
BV Raghavulu: బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి.. టీడీపీ, జనసేనలు జతకట్టడం సరికాదు..
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన ఇమాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహ్తా గ్రామంలో జరిగింది. దంపతులు రాజ్ కుమార్ సాహ్, సుష్మా దేవి ఆసుపత్రిలో చేరిన తన తల్లిని చూసేందుకు వెళ్లారు. అయితే.. ఆ సమయంలో భర్త రాజ్ కుమార్ తన భార్యను ‘టీ’ చేసి ఇవ్వమని కోరాడు. భార్య అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో అక్కడి నుంచి ఇంటికి వచ్చిన భర్త.. పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని ఆస్పత్రిలో ఉన్న భార్య సుష్మకు స్థానికులు తెలియజేశారు. వెంటనే భార్య ఇంటికి చేరుకుని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో పాట్నాకు తరలించారు. పాట్నాకు తరలిస్తుండగా భర్త రాజ్ కుమార్ మృతి చెందాడు.
అతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడి భార్య తనను తాను తిట్టుకుంటూ తీవ్రంగా రోధించింది. టీ చేసి తన భర్తకు ఎందుకు ఇవ్వలేదని ఆమె పదే పదే ప్రశ్నించుకుంటూ తీవ్ర దు:ఖ సాగరంలో మునిపోయింది. తన భర్త ఇలాంటి ఘటనకు పాల్పడతాడని అస్సలు అనుకోలేదని భార్య చెప్పింది. కాగా.. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.