పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. భార్యభర్తలు కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కలకలా జీవించాలని సూచిస్తుంటారు. కానీ, నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాహం మున్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ఆర్థిక కారణాలు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు, అయిష్టం ఇలా రకరకాల కారణాలతో వివాహబంధాలను తెంపుకుంటున్నాయి కొన్ని జంటలు. మరికొందరైతే చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్లు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన భార్య వంట చేయడం లేదని, తనను హింసిస్తుందని పెళ్లైన ఏడాదిన్నరకే విడాకులు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం..
Also Read:Jaishankar-Venezuela: మదురో కిడ్నాప్‌పై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు
ఎల్బీనగర్‌కు చెందిన ఒక వ్యక్తి భార్య వంట చేయడం లేదని, తన తల్లి వంట చేసేటప్పుడు భార్య సహకరించడం లేదని, ఇది క్రూరత్వం, హింసించడం కిందికి వస్తుందని కోర్టుకు విన్నవించాడు. తనకు విడాకులు మంజూరు చేయాలంటూ చేసిన అభ్యర్థనను కింది కోర్టు గతంలో కొట్టేసింది. సదరు భర్త కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిని జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాకతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. భర్త దాఖలు చేసిన విడాకుల అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కిందికి రాదని హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని పేర్కొంది.
వంట చేయకుండా తన తల్లికి సహకరించడం లేదంటూ భార్య క్రూరత్వానికి పాల్పడిందన్న భర్త వాదన ఆధారంగా విడాకులు మంజూరు చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. భార్య రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తారని, ఆమె వంట చేయకపోవడం భర్తను హింసిస్తున్నట్టుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అత్త వంట చేసేప్పుడు భార్య సహకరించకపోవడం హింసించడం కిందికి రాదని తీర్పులో పేర్కొంది. భర్త మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 వరకు ఆఫీసు విధుల్లో ఉండగా, భార్య ఉదయం 9 నుంచి 6 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారని, ఈ పనివేళల నేపథ్యంలో ఉదయం వేళ భార్య వంట చేయడం ఎలా సాధ్యమని కోర్టు ప్రశ్నించింది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్ని గొడవలు సర్వసాధారణం అని, వాటిని పరిష్కరించుకోకుండా విడాకులు కోరడం సమంజసం కాదని కోర్టు సూచించింది.