CM Chandrababu: రైతుల్లో నమ్మకం, భరోసా కలిగించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరి చేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై మంగళవారం నాడు సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.”ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల్లో నమ్మకం, భరోసా కలగాలని చంద్రబాబు అన్నారు.
Read Also: Child Trafficking Case: పసిపిల్లల విక్రయ ముఠా కేసులో కీలక పురోగతి..
ఇక, భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొత్త పాస్ పుస్తకాలను ముద్రించడానికి ముందుగానే గ్రామ సభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలని తెలిపారు. ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాలన్నారు . రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలను తీర్చిదిద్దామని ఎవ్వరూ ట్యాంపరింగ్ చేయకుండా, నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయకుండా పాస్ పుస్తకాలను ముద్రించాలని వెల్లడించారు. పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ఇక, పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాజముద్ర, క్యూఆర్ కోడ్ వేయడంతో పాటు మీ భూమి- మీ హక్కు, జై భారత్… జై తెలుగుతల్లి అనే నినాదాలు కూడా ముద్రించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.