Madhavaram Krishna Rao: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా మూలనపెట్టిందని, అందుకే ప్రజలు తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్‌లో గిరి సాగర్, రాజు సాగర్ ఆధ్వర్యంలో యువనేత మధు నాయకత్వంలో వందమంది యువకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు యువకులకు గులాబీ కండువా కప్పి, పార్టీ లోకి ఆహ్వానించారు.
Read Also: Mahakumbh Mela 2025 : కుంభమేళా గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు 13 మందిపై ఎఫ్ఐఆర్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా మారిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో ప్రజలకు ఏమాత్రం సహాయపడలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలతోనే పరిమితమై, సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందిస్తామని చెప్పి, తమ హామీలను అమలు చేయలేక ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు. అందుకే యువత ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయి, బీఆర్‌ఎస్‌లో చేరుతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.