సంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ దగ్గర ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చేలరేగడంతో అక్కడే పని చేస్తున్న పలువురు కార్మికులు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం అవుతుంది. శిథిలాల కిందపడి మొహం పూర్తిగా నిజ్జు నుజ్జు అయింది. ఇతర కార్మికుల ద్వారా మృతుని ఆచూకీని పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇంకా, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో 15 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Read Also: Sruthi Haasan : శృతిహాసన్ రేంజ్ పెరిగింది గురూ..
ఇక, ఎస్బీ ఆర్గానిక్స్ యూనిట్-1లో కాలంచెల్లిన రియాక్టర్లను ఉపయోగించడం వల్లే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతో పాటు బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. ఇటీవలే బాయిలర్ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేసినా.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని కార్మికులు అంటున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న 24 పారిశ్రామిక వాడల్లో గత రెండేళ్ల వ్యవధిలో 40 ప్రమాదాలు జరిగాయని పోలీసులు చెప్పారు. రెండేళ్లలో 72 మంది కార్మికులు మృతి చెందగా.. 225 మందికి గాయాలు అయ్యాయి. ఇక, మృతులు SB ఆర్గానిక్స్ డైరెక్టర్ రవికుమార్ (హైదరాబాద్), ప్రొడక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం(ఏపీ), దయానంద్ (తమిళనాడు), సురేష్పాల్ (ఉత్తర ప్రదేశ్), కార్మికుడు విష్ణుతో పాడు ఆరో మృతుడి వివరాలు ఇంకా లభ్యం కాలేదు అని పోలీసులు వెల్లడించారు.