ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై తేజస్వీ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు. తాజాగా జనగణన చేపట్టకుండానే దేశంలో హిందూ, ముస్లింల జనాభాపై కేంద్రం ఎలా ఒక అంచనాకు వస్తుందని ప్రశ్నించారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగిందని, హిందువుల జనాభా తగ్గిందంటూ విడుదలచేసిన ఈఏసీ–పీఎం రిపోర్ట్‌పై ఆయన స్పందించారు. ‘‘ అసలైన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే హిందూ, ముస్లింల మధ్య మోడీ సర్కార్ చిచ్చుపెడుతోంది. జనాభా లెక్కలు లేకుండానే ఎలా ఈ కొత్త లెక్కలతో వచ్చారు.? 2021లో కూడా జనగణన ఎందుకు సాధ్యంకాలేదు. అప్పుడు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా. హిందూ, ముస్లింలను వేర్వేరుగా పక్షపాత ధోరణితో చూసే విధానాన్ని మానుకోండి. సమస్యల గురించే మాట్లాడండి’ అని తేజస్వీ హితవు పలికారు.
READ MORE: AP High Court: ఏపీలో డీబీటీల పంపిణీపై హైకోర్టు కీలక ఆదేశాలు
కాగా.. EAC-PM ప్రకారం.. భారతదేశంలో హిందువుల వాటా 1950లో 84 శాతం ఉంటే 2015లో 78 శాతానికి తగ్గింది. అదే సమయంలో ముస్లింల సంఖ్య 9.84 శాతం నుంచి 14.19 శాతానికి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. భారత్‌లోనే కాకుండా నేపాల్ లో మెజారిటీ(హిందూ) మతం జనాభా దాని వాటాలో 3.6 శాతం క్షీణతను చూసింది. మే 2024లో విడుదల చేసిన ఈ అధ్యయనం, ప్రపంచవ్యాప్తంగా 167 దేశాలను ట్రెండ్స్‌ని అంచనా వేసింది. డేటాను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా భారత్‌లో మైనారిటీలు కేవలం రక్షించబడటమే కాకుండా, అభివృద్ధి చెందుతున్నారని అధ్యయన రచయితలు చెప్పారు.