ఏపీ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే.. కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నంద్యాలకు వరద ముప్పు పొంచివుంది. క్యాచ్ మెంట్ ఏరియా నుండి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 16.9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం
కెపాసిటీ 16.5 లుగా ఉంది.
స్పిల్ వే ద్వారా 15 వేల క్కుసెక్కుల నీటిని కుందు నదికి అధికారులు విడుదల చేశారు. అనధికారికంగా మరో 10 వేల క్కూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. నంద్యాల సహా కుందు పరివాహ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో.. ఇరిగేషన్ అధికారులతో ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ మహేశ్వర్ రెడ్డిలు మాట్లాడి రెవిన్యూ, పోలీస్, మున్సిపల్ సిబ్బందిని ఎస్పీ రఘువిర్ రెడ్డి అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశించారు.