ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా, వరదలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో 42 కాలనీల్లోని ఇళ్లలోకి వర్షం వరద నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అధికారులు పాలకులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి వంద కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వాగులు వంకలు పొంగిపోర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు వరంగల్ ప్రజల్ని వణికిస్తున్నాయి. రికార్డు స్థాయిలో భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జోరువానతో ఓరుగల్లు బొరుమంటుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 22 డివిజన్ లలో 42 కాలనీల్లోని ఇళ్ళలోకి వరద నీళ్ళు చేరాయి. నీటమునిగిన ఎస్ఆర్ నగర్, సాయినగర్, బృందావనికాలనీ, ఎన్టీఆర్ నగర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావిణ్య, సిపి రంగనాథ్ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఇళ్లలోకి వర్షం వరద నీరు చేరి సర్వం తడిసిపోవడంతో పునరావసం కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు. వర్షం వరదలు తగ్గేవరకు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
గతవారం నాలుగు రోజులపాటు కురిసిన వర్షంతో కోలుకుంటున్న తరుణంలో కుంభవృష్టి గ్రేటర్ వరంగల్ ను అతలాకుతలం చేసింది. నగరంలో సిపి రంగనాథ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నీటమునిగిన కాలనీల్లో ట్రాక్టర్ లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో పలుకాలనీలు చెరువులను తలపించడానికి అక్రమ నిర్మాణాలే కారణమని ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. 65 ఏళ్లుగా ఎవరు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పోవాలంటే మరో రెండేళ్ళ టైం పడుతుందని ఎమ్మెల్యే నరేందర్ చెప్పారు. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా అని చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు.
భారీ వర్షంతో అయినవోలు మండలం కొండపర్తి వద్ద రోడ్డు తెగిపోయింది. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు దారి ధ్వంసమయింది. ఆకేరువాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. వరద ఉధృతికి వర్ధన్నపేట వద్ద పాత బ్రిడ్జి ప్రమాద స్థాయికి చేరింది. పంథని వద్ద లోలెవెల్ లో ఉన్న రోడ్డు నీటమునిగి ఖమ్మం వరంగల్ రూట్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంథిని నుండి వర్ధన్నపేట వరకు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇల్లందలో వారంలో రెండోసారి ఇళ్ళలోకి వరదనీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వస్తే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతకాల్సి వస్తుందని లోతట్టు ప్రాంత ప్రజలు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు మహబూబాబాద్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన వర్షాలతో చెరువులు కుంటలు పొంగిపోర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం నుంచి రామన్నగూడెం వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. జంపన్న వాగు పొంగి మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక బయ్యారం లో పెద్ద చెరువు పొంగడం తో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. నర్సంపేట మండలం కొనరావు పెట చెరువు పొంగిపొర్లడంతో కొద్దీ సేపు ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. అటు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మాపురంలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షం పడితే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.