ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఎండి అంబేద్కర్ తెలిపారు.
లోతట్టుప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో సైతం వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అయితే.. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.