Healthy Lifestyle Tips: పండగ అయినా, పుట్టినరోజైనా, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భమైనా పెద్దలు మనకు “దీర్ఘాయుష్మాన్ భవ” అని ఆశీర్వదిస్తారు. అంటే నూరేళ్ల ఆయుష్షుతో ఆనందంగా జీవించమనే అర్థం. అయితే అంతకాలం జీవించాలంటే కేవలం అదృష్టం సరిపోదు. దానికి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంతకాలం చింతలు లేకుండా, అలసట రాకుండా జీవన ప్రయాణాన్ని ముందుకు నడిపించగలుగుతాడు. అందుకే ఆరోగ్యం కావాలని కోరుకోవడం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా కొన్ని సూత్రాలను పాటించడం కూడా అవసరం.
ఆరోగ్యంతో పాటు జీవన నాణ్యత కూడా చాలా ముఖ్యం. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు ప్రత్యేకంగా “క్వాలిటీ ఆఫ్ లైఫ్” మీద దృష్టి పెడతారు. అందుకే వారు నూరేళ్ల వరకు హాయిగా, జబ్బులు లేకుండా జీవిస్తున్నారు. వీరి ఆరోగ్య రహస్యం ఏమిటి? వారు ఏమి తింటారు? ఎలా జీవిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు, పరిశోధకులు సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు. వారి పరిశోధనల ద్వారా ఒక ముఖ్యమైన విషయం స్పష్టమైంది. ఆరోగ్యం అనేది ప్రత్యేకంగా సాధించాల్సిన లక్ష్యం కాదు, అది మంచి జీవనశైలికి సహజంగా వచ్చే ఫలితమని.
ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైగా జీవిస్తున్న ప్రజలు ఎక్కువగా కనిపించే ప్రాంతాలను “బ్లూ జోన్స్” అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సార్డీనియా, గ్రీస్‌లోని ఇకారియా, కోస్టారికాలోని నికోయా వంటి ప్రాంతాలు దీనికి ఉదాహరణలు. ఇక్కడ నివసించే ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరి దృష్టి ఆరోగ్యంపై కాదు, జీవన నాణ్యతపై ఉంటుంది. క్యాలరీలు లెక్కపెట్టడం, తరచూ డైట్లు మార్చడం వీరి అలవాటు కాదు. స్థానికంగా దొరికే ఆహారం, సంప్రదాయ వంటకాలను సమయానికి తీసుకుంటారు.
ఈ ప్రాంతాల ప్రజలు కడుపు పూర్తిగా నిండే వరకు తినరు. జపాన్‌లో దీనిని “హర హాచిబు” అంటారు. అంటే కడుపు 80 శాతం నిండగానే తినడం ఆపేయడం. ఇది జీర్ణక్రియకు, ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. నెమ్మదిగా నమిలి తినడం, చిన్న ప్లేట్లలో భోజనం చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం వంటి అలవాట్లు కూడా వీరిలో సాధారణం.
ఆరోగ్య రహస్యాల్లో మరో ముఖ్యమైన అంశం బలమైన బంధాలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వీరి జీవనంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవితంలో నిరాశ వచ్చినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు ఈ బంధాలే కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అందుకే బ్లూ జోన్స్ ప్రాంతాల్లో బంధాలకు ఎంతో విలువ ఇస్తారు.
వయసు పెరిగిన తర్వాత కూడా ఇక్కడి ప్రజలు ఖాళీగా కూర్చోరు. రిటైర్ అయినా కుటుంబానికి తమవంతు సాయం చేస్తారు. కూరగాయలు పండించడం, వంట చేయడం, మనవళ్లను చూసుకోవడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. “ఇంకేం చేయలేం” అనే భావన వారికి ఉండదు. ఏదో ఒక పనిలో నిమగ్నంగా ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంటారు.
ఆహార విషయంలో కూడా వీరు మితంగా వ్యవహరిస్తారు. ఖరీదైన ఆహారం కాదు, కానీ పోషకాలు ఉన్న ఆహారం వీరి ఎంపిక. కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే పప్పులు, సోయా, బాదం, ఖర్జూరం వంటి ఎండు ఫలాలు ఎక్కువగా తింటారు. మాంసాహారాన్ని పూర్తిగా మానరు. కానీ, వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే తీసుకుంటారు. అది కూడా పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లోనే.
ఈ రోజుల్లో హడావిడిగా జీవించే మన జీవితంలో ఉదయం పూట సరైన ఆహారం తీసుకునేవారు చాలా తక్కువ. రెండు నిమిషాల్లో తయారయ్యే ఫాస్ట్ ఫుడ్‌తో సరిపెట్టుకుంటాం. కానీ బ్లూ జోన్స్ ప్రాంతాల్లో ఉదయం పూట దండిగా భోజనం చేసి రోజును ప్రారంభిస్తారు. రాత్రి పూట తక్కువగా తినడం వీరి మరో ప్రత్యేకత. పొట్టలో కొంత ఖాళీ ఉంచడం ఆరోగ్యానికి మంచిదని వారు నమ్ముతారు.
ఇక్కడి వందేళ్ల వృద్ధులు కూడా మంచాలకు అతుక్కుపోయి ఉండరు. రోజూ నడక, చిన్నచిన్న పనులు చేస్తూ చురుకుగా ఉంటారు. ఏ పని చేసినా దానికి ఏదో ఒక ప్రయోజనం ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా వీరిలో ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. ఒత్తిడి లేకపోతే సగం జబ్బులు లేనట్టేనని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యానికి, దీర్ఘాయుష్యానికి ఒత్తిడి లేని జీవనశైలే అసలైన మంత్రం.
ఇవన్నీ అక్కడి వారికే సాధ్యమా అంటే కాదు. మనం కూడా కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఎక్కువకాలం జీవించవచ్చు. మంచి ఆహారం, మంచి అలవాట్లు, బలమైన బంధాలు, సానుకూల దృక్పథం ఇవన్నీ పాటిస్తే దీర్ఘాయుష్యం మనకూ దక్కడం పెద్ద కష్టం కాదు.