రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాల భూములపై వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూకి) చెందినవే అని, వాటిని వేలం వేయొద్దంటూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భూముల వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూడేళ్లలో మరలా అధికారంలోకి వస్తామని, ఆ 400 ఎకరాలు తిరిగి రిటర్న్ తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్‌సీయూ భూములము ఎవరు కొన్నా నష్టపోతారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘ప్రజల సొమ్మును రక్షించాల్సిన మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అయితే దొంగ లాగా ఎందుకు పోతున్నారు. పది రోజుల సమయం అడిగిన మీరు.. ఎందుకు అంత తొందరగా బుల్డోజర్‌లు పంపించారు. సెలవులు చూసుకొని వెళ్లి చెట్లు కూల్చుతున్నారు. పేరుకే ప్రజాపాలన, ఎక్కడా కూడా ప్రజాస్ఫూర్తి లేదు. పశ్చిమ హైదరాబాద్‌లో కేవలం 2500 ఎకరాలు మాత్రమే ఉంది. దీనిని ఎందుకు పాడు చేస్తున్నారు. ఈ విషయంపై కేసీఆర్ హైదరాబాద్ నాయకులతో చర్చించారు. హైదరాబాద్‌కు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెర లేపాము. అప్పుడు హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అవార్డ్ వచ్చింది. మా హయాంలో దేశంలో అన్ని రాష్ట్రాలలో కెల్లా తెలంగాణలో గ్రీన్ కవర్ పెరిగింది. అందుకే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల లో మరలా అధికారంలోకి వస్తాం. రాగానే ఆ 400 ఎకరాలు తిరిగి రిటర్న్ తీసుకుంటాం. ఆ 400 ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు చేస్తాము. ఆ భూములు ఎవరు కొనుకున్నా నష్టపోతారు. ముందే చెబుతున్నాం, తర్వాత ఎవరూ మమ్మల్ని అడగొద్దు’ అని కేటీఆర్ హెచ్చరించారు.
‘మేము అధికారం లో ఉన్నప్పుడు రోహిత్ వేముల విషయంలో హెచ్‌సీయూకి రాహుల్ గాంధీ వస్తే మేము ఎస్కార్ట్ ఇచ్చాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది చూడండి. రాహుల్ గాంధీ ఒకసారి మీ ప్రభుత్వానికి చెప్పండి, దేశం అంతా కోడై కూస్తున్నా ముఖ్యమంత్రికి కనిపించడం లేదు. మరోసారి చెబుతున్నాం, ఈ ల్యాండ్ కోసం ఎవరూ కూడా వేలంలో పాల్గొనకండి. ఇది హైదరాబాద్ ప్రజల అస్థి. ఈ 400 ఎకరాలు కాపాడే బాధ్యత మాది. మంత్రులకు విషయం తెలియక మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గర మెప్పు కోసం, 20-30 శాతంల కోసం మాట్లాడుతున్నారు. బండి సంజయ్ ఐటమ్ నెంబర్ సిక్స్. కేంద్ర ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో చూసుకోవాలి. తంబాకు తింటూ తిరిగితే బండి సంజయ్ కు ఏమి తెలుస్తుంది’ అని కేటీఆర్ విమర్శలు చేశారు.