HCA Elections 2023 Results Out Today: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు మొదలయ్యాయి. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరగనుంది. ఇక సాయంత్రం 6 గంటలలోపు ఫలితాలు వెలువడే అవకాశముంది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పర్యవేక్షణలో జరుగుతున్న హెచ్‌సీఏ ఎన్నికలకు అధికారులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు.
అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ అభ్యర్థుల కోసం హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 173 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ సారి నాలుగు ప్యానెల్స్ బరిలో ఉన్నాయి. అధ్యక్ష బరిలో అర్సనపల్లి జగన్ మోహన్‌రావు, అమర్‌నాథ్, అనిల్ కుమార్, పీఎల్ శ్రీనివాస్ ఉన్నారు. ప్రభుత్వ మద్దతుతో అధ్యక్ష పదవికి పోటీకి దిగిన అర్సనపల్లికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ప్రస్తుతం జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న జగన్..హెచ్‌సీఏలో మార్పులు తీసుకొచ్చేందుకు పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వ సహకారంతో తాను హెచ్‌సీఏ అభివృద్ధికి పాటుపడుతానని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
హెచ్‌సీఏ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ హెచ్‌సీఏ ఎన్నికలకూ రాజకీయ రంగు తోడైంది. బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమ ప్యానల్‌కు ప్రభుత్వ మద్దతు ఉందని జగన్ మోహన్‌రావు చెబుతున్నారు. యూనైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ పేరుతో జగన్ బరిలో ఉన్నారు. గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ పేరుతో అనిల్ కుమార్ ప్యానల్ ఉంది. బీజేపీ, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ మద్దతుతో అధ్యక్షుడిగా అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ పేరుతో ఎన్నికల బరిలోకి శివలాల్ యాదవ్ దిగుతున్నారు. అర్షద్ ఆయూబ్ ప్యానల్ తరపున అధ్యక్షునిగా అమర్నాథ్ పోటీ చేస్తున్నారు.