గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనలు.. ప్రభుత్వం పరిష్కరించాల్సిన డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అని అన్నారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించి ఉసూరుమనిపించారని తెలిపారు. అభ్యర్థులు, నిరుద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలిగించే మాటలు చెప్పలేదు.. సమస్యకు పరిష్కారం చూపలేదని హరీష్ రావు లేఖలో తెలిపారు.
IND vs ZIM: రాణించిన సంజూ శాంసన్.. జింబాబ్వే టార్గెట్..?
ఎన్నికల ప్రచార సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం వల్లనే నిరుద్యోగుల పోరాటం మొదలైందన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించాలని కోరుతున్నానని హరీష్ రావు తెలిపారు. ‘మావి కొత్త డిమాండ్లు కావు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే, రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రంథాలయాలకు, కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇచ్చిన హామీలే’ అని అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదని ప్రశ్నించారు. మీరు, మంత్రులు, అధికారం యంత్రాంగం మొత్తం ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను సంఘవిద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటం దౌర్భాగ్యం అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సహా అభ్యర్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించడం, ఇనుప కంచెలు వేయడం, ముందస్తు అరెస్టులు చేయడం, ఎక్కడిక్కడ నిర్బంధించడం వంటి చర్యలు అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. నిరుద్యోగుల బాధలను ప్రపంచానికి చూపించే జర్నలిస్టులను సైతం బెదిరించడం, అరెస్టులు చేయడం, వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని తెలిపారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.. వెంటనే అరెస్టులు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Russia: ట్రంప్‌పై హత్యాయత్నం.. జో బైడెన్‌పై రష్యా సంచలన వ్యాఖ్యలు..
నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ మీరు నిందారోపణలు చేయడం ఆక్షేపణీయం అని హరీష్ రావు అన్నారు. ఇలా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం వల్ల అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభించదన్నారు. నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరు కూడా పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం వల్ల వారు శాంతించరని చెప్పారు. పైగా రెచ్చగొట్టినట్లుగా భావిస్తారన్నారు. నాడు హామీలు ఇచ్చిన వారు నేడు పదవుల్లో ఉన్నారు కానీ.. నిరుద్యోగులు మాత్రం ఇంకా రోడ్లపైనే ఉన్నారనే విషయాన్ని గుర్తించండని పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తే మంచిదని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు అశాంతితో ఉన్న రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా సాగటం అసాధ్యం.. మాది ప్రజాపాలన అని ప్రచారం చేసుకునే మీరు, నిరుద్యోగుల సమస్యల విషయంలో భేషజాలకు పోవడం సరికాదన్నారు. కంచెలు, ఆంక్షలు విధించి వారి గొంతులను నొక్కాలనుకున్న మీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. అభ్యర్థులు, నిరుద్యోగుల జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో చర్చలకు ఆహ్వానించాలని.. సహృదయంతో వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరుతున్నట్లు లేఖలో ప్రస్తావించారు.