Harish Rao: తెలంగాణ భవన్‌లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, అనైతిక మార్గాల్లో డబ్బు సంపాదిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడుతూ.. “మంత్రి కూతురు చెప్పిన ‘తుపాకీ కథ’ ఇప్పటికీ తేలలేదని.. ఆ తుపాకీ ఎవరు పంపారో, ఆ వెనుక ఉన్నది ఎవరో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదని ప్రశ్నించారు. దీనితో ఈ అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని హరీష్ రావు విమర్శించారు. మహిళలను, విద్యార్థులను, ఉద్యోగులను, రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఇక గత బీఆర్‌ఎస్ పాలనను గుర్తు చేస్తూ… కేసీఆర్ చెప్పకపోయినా ఎన్నో పనులు చేశారని.. కానీ, ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు గొప్పలు చెప్పి, ఇప్పుడు చేతల్లో చూపించడం లేదని వ్యాఖ్యానించారు.
Abdullahpurmet: హైటెన్షన్ డ్రామా.. విద్యుత్ టవర్ పై నుండి దూకేసిన వ్యక్తి…!
ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ మార్గాలపై హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కేవలం వైన్ షాపుల దరఖాస్తుల మీదే రూ. 3 వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. అంతేకాకుండా, ఆ సొమ్మును పేద ప్రజల సంక్షేమానికి వాడకుండా ఢిల్లీ పెద్దలకు వాటాలు పంపుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో రజకుల సమక్షంలో హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటాన్ని బీఆర్‌ఎస్ మరింత తీవ్రతరం చేస్తుందని ఈ సమావేశం స్పష్టం చేసింది.