NTV Telugu Site icon

Harish Rao: ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నారు.. అదానీ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి..

Harish Rao

Harish Rao

Harish Rao: అదానీ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజ్‌భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. మేము రేవంత్ రెడ్డి, అదానీ ఫోటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారన్నారు. అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 12 వేల కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్నారు. అదానీపై రేవంత్ రెడ్డి పోరాటం నిజమైతే ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. అదానీకి వంద కోట్లు వాపస్ ఇచ్చినట్లు రూ.12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలన్నారు. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రేవంత్ రెడ్డి అనుమతులు ఇస్తున్నారని హరీష్‌ రావు ఆరోపించారు. అదానీకి రేవంత్ రెడ్డి కొమ్ముకాస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీకి రెడ్ కార్పెట్ వేసి తెలంగాణ పరువును, రాహుల్ గాంధీ పరువును రేవంత్ రెడ్డి మంటకలిపారన్నారు. రేపు అసెంబ్లీలో అదానీ, రేవంత్ రెడ్డి సంబంధంపై చర్చ పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాజ్ భవన్ ముట్టడిలో అదానీ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడలేదన్నారు. చట్టం అందరికి సమానం అయితే కాంగ్రెస్ నేతలపై సీపీ సీవీ ఆనంద్ కేసులు పెట్టాలన్నారు.

Read Also: TG TET: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల

మరో వైపు మీడియా చిట్‌చాట్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం ప్రకటన చేస్తే అమలు చేయాలి.. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు. నవంబర్ 30 న 3 లక్షల 13 వేల మంది రైతులకు రెండో సారి రుణ మాఫీ చేసున్నాం అన్నారని.. ఇంత వరకు 3 లక్షల 13 మంది రైతులకు రూ. 2,474 కోట్లు ఇంత వరకు ఖాతాలో పడలేదని తెలిపారు. 19 నవంబర్ వరంగల్ స్వయం సంఘాల ఖాతాల్లో అమౌంట్ పడలేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరిలో పీఆర్సీ బకాయిల చెక్ రూ.281 కోట్ల చెక్ కూడా జమ కాలేదన్నారు. అది చివరకు ఆర్టీసీ సంస్థనే మళ్ళీ వారి ఖాతాలో జమ చేశారన్నారు. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తాం అని చాలా సార్లు చెప్పారని.. కానీ ఇదో పెద్ద బోగస్ అని తేలిపోయిందన్నారు. 2015లో బీఆర్ఎస్ హయాంలో రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇదే ఇస్తుందని.. రూ.5 లక్షల వరకు మాత్రమే వడ్డీలేని రుణాలు.. మిగత వాటికి వడ్డీ కట్టాల్సిందేనన్నారు. లక్ష కోట్లు అని చెప్పింది అంతా అబద్ధమని అన్నారు. ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ ఒక్కటీ ఇవ్వడం లేదన్నారు. తులం బంగారంలేదు, స్కూటీ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు.. ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదన్నారు.