Site icon NTV Telugu

Harish Rao : రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు

Harish Rao

Harish Rao

Harish Rao : మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతూనే ఉద్యోగుల కష్టాలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటనలో హరీష్‌ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

“మీ పాలనలో చిరు ఉద్యోగుల దుస్థితి దారుణంగా తయారైంది. వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు,” అని హరీష్‌ రావు పేర్కొన్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి, చిరు ఉద్యోగుల పేదరికం కనబడటం లేదని ఆయన విమర్శించారు. నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్ (MGNREGS) ఉద్యోగులు, నెల రోజులుగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని హరీష్‌ రావు తెలిపారు. ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు వంటి వేలాది చిరు ఉద్యోగులు తమ జీతాల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారనే దయనీయ పరిస్థితి నెలకొనిందని ఆయన వ్యాఖ్యానించారు.

Manchu Family : జిల్లా అదనపు కలెక్టర్ తో ముగిసిన మంచు మనోజ్ వివరణ

“దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరం. నెలలు గడిచినా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమై, చిరు ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారు. వాళ్లు కండ్లు కాయలు కేసులా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హరీష్‌ రావు సీఎం రేవంత్ రెడ్డిపై గట్టి విమర్శలు చేశారు. “కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని చెప్పుకోవడం మానేయండి. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి,” అని సూచించారు. చిరు ఉద్యోగులందరికీ వెంటనే వేతనాలు చెల్లించాలని హరీష్‌ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల కష్టాలను మరిచి సొంత ప్రయోజనాల కోసం ప్రచారం చేయడం తగదని హరీష్‌ రావు తేల్చిచెప్పారు.

Donald Trump: ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత రోజే “ఇమ్మిగ్రేషన్‌” దాడి ప్రారంభం..

Exit mobile version