Donald Trump: అమెరికాకు 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పలు దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు హాజరవుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రోజు నుంచే ట్రంప్ యాక్షన్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘ఇమ్మిగ్రేషన్’’పై దృష్టి పెడుతున్నట్లు సమచారం. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని అణిచివేసే పెద్ద ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Read Also: Minister Ravikumar: ఏపీలో 9 గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేత ప్రచారం.. మంత్రి క్లారిటీ..
చికాగోలో పెద్ద ఇమ్మిగ్రేషన్ దాడిని ప్రారంభిస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. వారం రోజుల పాటు జరిగే ఈ దాడిలో 200 మంది వరకు ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు పాల్గొంటారు. ఈ అణిచివేత కేవలం చికాగోకు మాత్రమే పరిమితం కాకుండా, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఐసీఈ దాడుల్ని వేగవంతం చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూయార్, మియామి వంటి అమెరికా నగరాల్లో అక్రమ వలసదారుల అరెస్టులు గణనీయంగా జరగబోతున్నాయి.
ఇదే కాకుండా ట్రంప్ అధ్యక్షుడుగా తొలి సంతకాన్ని లేకన్ రిలే బిల్లుపై చేయనున్నారు. దీని ప్రకారం దొంగతనం, హింసాత్మక నేరాలకు పాల్పడే వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. గతేడాది జార్జియాలో వెనిజులా వ్యక్తి చేతిలో హత్యకు గురైన విద్యార్థి పేరుపై ఈ చట్టాన్ని తీసుకురానున్నారు. ట్రంప్ ఎన్నిక తర్వాత రికార్డు స్థాయిలో వలసదారుల బహిష్కరణ జరగబోతున్నట్లు తెలుస్తోంది. బైడెన్ పాలనలో గత ఏడాది, దశాబ్ధకాలంలో ఎప్పుడూ లేని విధంగా డాక్యుమెంట్లు లేని 2,71,000 మంది వలసదారుల్ని డిపోర్ట్ చేశారు. ఈ సంఖ్యను ట్రంప్ అధిగమించబోతున్నట్లు తెలుస్తోంది.