టీడీపీ, వైసీపీలపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ పాలన దేశానికి పట్టిన చీడ అని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని, రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని గద్దె దించడమే మా లక్ష్యమన్నారు. దుష్ట పరిపాలనకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని, మూడున్నర ఏళ్లుగా ఓటు బ్యాంక్ రాజకీయాలే జరుగుతున్నాయన్నారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు అభివృద్ధి చేయలేక పోయారని, జాతీయ జీడీపీలో 9 శాతం ఐటీ రంగం నుండే వస్తుందన్నారు. అలాంటి ఐటీ రంగాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. ఆంధ్రాలో ఐటీ కంపెనీలను తరిమేస్తున్నారని, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారన్నారు.
Also Read : Covid BF-7 Variant: బీఎఫ్-7 వేరియంట్ తీవ్రత భారత్‌లో అంతగా ఉండకపోవచ్చు.. ఎందుకంటే?
గతంలో వైఎస్ జగన్ హైదరాబాదు కేంద్రంగా రాజకీయాలు చేశారని, ఇప్పుడు చంద్రబాబు హైదరాబాదులో రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గెలిస్తేనే ఆంధ్రాలో ఉంటారా? ఒకరు జూబ్లీ హిల్స్, ఇంకొకరు లోటస్ పాండా అని ఆయన అన్నారు. భారత్ లో డిజిటల్ వండర్ వాజ్ పాయ్ వల్ల మాత్రమే సాధ్యమయ్యిందని ఆయన వెల్లడించారు. భారత్ లో అణుపరీక్షలు చేసింది వాజ్పేయి కాలంలోనేనని ఆయన గుర్తు చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వం స్కాముల మయంగా మారిందని, 2జీ కుంభకోణం కొల్ కుంభకోణం పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రలో బీజేపీకి అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్ పాలన చేసి చూపిస్తామన్నారు. దేశ భక్తి కలిగిన బీజేపీకి అవకాశం ఇవ్వండని ఆయన అన్నారు.