అమెరికా (America) తుపాకీ కల్చర్ ఇండియాకు పాకినట్లుగా కనిపిస్తోంది. గురువారమే ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) ఓ శివసేన నేత తుపాకీ బుల్లెట్లకు బలైపోయాడు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా ఓ సెలూన్ షాపులోకి (Hair Salon) అగంతకులు ప్రవేశించి అతి సమీపం నుంచి తలకు గురి పెట్టి కాల్చడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికులు.. పోలీసులు ఉలిక్కిపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ (Delhi) గ్రామీణ ప్రాంతంలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు హెయిర్ సెలూన్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మృతులు సోను, ఆశిష్‌లుగా పోలీసులు గుర్తించారు. కాల్పుల వెనుక ఉద్దేశం ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.