హైదరాబాద్ లోని హోటల్ తాజ్ డెక్కన్ లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ పైన ఆధారపడి ఉన్నాయన్నారు. గల్ఫ్ వెళ్లే కార్మికులకు శిక్షణ ఇస్తాం… ఏజెంట్ల చేతిలో మోస పోకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గల్ఫ్ బాధితుల పిల్లలకు మంచి చదువు అందిస్తాం.. గల్ఫ్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డు గురంచి ఆలోచిస్తామని ఆయన చెప్పారు.. అలాగే, రైతు బీమా తరహాలో.. గల్ఫ్ కార్మికుల బీమా అందిస్తామని ప్రకటించారు. ఇందులో గల్ఫ్ కార్మికుల ప్రమాద భీమా రూ. 5 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక, గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విభాగానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తాం అని తెలిపారు. జూన్, జులైలో పాలసీ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు.
Read Also: Malladi Vishnu: సీఎంపై దాడి చేసింది టీడీపీ వాళ్లే..! ఆధారాలున్నాయి..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2018లో ఓడిపోయినా కాబట్టే 2019లో ఎంపీ అయ్యాను.. 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యాను అని తెలిపారు. అలాగే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కాబట్టి.. 2024లో కేంద్ర మంత్రి అవుతారు అని చెప్పారు. ఇక, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కొందరు బాధ పడ్డారు.. నా శత్రులు సంతోష పడ్డారు అని పేర్కొన్నారు. వీడి పని అయిపోయిందని సంతోష పడ్డారు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు.