గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ 2024లో 127 దేశాలలో భారతదేశం 105వ స్థానంలో ఉంది. అయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది భారత్ ర్యాంక్ మెరుగుపడింది. కానీ భారతదేశం ఇప్పటికీ ‘తీవ్రమైన’ ఆకలి సమస్యలతో ఉన్న దేశాలలో జాబితాలో ఉంది. భారతదేశం పరిస్థితి పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ కంటే దీనంగా ఉంది. పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కంటే కొంచెం మెరుగ్గా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. శ్రీలంక 56, నేపాల్ 68, బంగ్లాదేశ్ 84 భారత్ కంటే చాలా ముందున్నాయి.
2024లో 19వ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) నివేదికలో..
2024లో 19వ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) నివేదికలో 127 దేశాలలో భారతదేశం 105వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం.. ఆకలి ‘తీవ్రమైన’ సమస్యగా ఉన్న దేశాలలో భారతదేశం ఉంది. గత నివేదికలో కూడా భారతదేశం దాని పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉంది. కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్తుంగర్‌హిల్ఫ్ సంయుక్తంగా ప్రచురించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఆకలిని ట్రాక్ చేస్తుంది. ప్రత్యేకించి అత్యవసర చర్య అవసరమయ్యే ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది.
2000- 2008లో ఆకలి కేకలు..
2024 నివేదికలో భారతదేశం యొక్క స్కోర్ 27.3, ఇది తీవ్రమైన ఆకలిని సూచిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో పోషకాహార లోపం యొక్క ప్రాబల్యంలో స్వల్ప పెరుగుదల ఉందని నివేదిక పేర్కొంది. అయితే, భారతదేశం యొక్క 2024 స్కోర్ దాని 2016 జీహెచ్‌ఐ (GHI) స్కోర్ 29.3 నుంచి కొంత మెరుగుదల చూపిస్తుంది. 2016లో కూడా భారత్ ‘తీవ్ర’ కేటగిరీలోనే ఉండేది. 2000- 2008లో వరుసగా 38.4, 35.2 స్కోర్‌లతో పోలిస్తే ఇది గణనీయమైన పురోగతి.
పిల్లల్లో పోషకాహార లోపం..
భారతదేశం ఇప్పటికీ పిల్లల పోషకాహార లోపం వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలో పిల్లల ఎదుగుదల రేటు 35.5%, ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 2.9%, పోషకాహార లోపం యొక్క ప్రాబల్యం 13.7% నమోదైంది. 2000 నుంచి భారతదేశం తన శిశు మరణాల రేటును గణనీయంగా మెరుగుపరుచుకున్నప్పటికీ, పిల్లల పోషకాహార లోపం తీవ్రమైన సమస్యగా మిగిలిపోయింది.