Gautam Gambhir React on India vs Pakistan Clash in World Cup 2023: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫలితంపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ నుంచి కనీస పోటీ కూడా లేదని, ఇలాంటి ఆటతీరు ఉపఖండ క్రికెట్‌కు చేటు చేస్తుందన్నారు. హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారని గంభీర్ ప్రసంశించారు. అక్టోబర్ 14న నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనుకుంటే.. ఏక పక్షంగా ముగిసింది.
గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘భారత్ మరోసారి అద్భుతం చేసింది. చితక్కొట్టారనే పదం చాలా తక్కువగా వాడుతుంటాం. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో అయితే ఈ పదం ఎక్కువగా వినపడదు. ఎందుకంటే ఇరు జట్లూ హోరాహోరీగా మ్యాచ్ ఆడుతాయి. విజయం కోసం చివరి బంతి వరకూ పోరాడతాయి. కానీ గత మ్యాచ్‌లో చితక్కొట్టారనే పదం వాడాల్సి వచ్చింది. ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో మినహా పాక్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. అయితే ఇది ఉపఖండ క్రికెట్‌కు సరైంది కాదు’ అని అన్నారు.
Also Read: World Cup 2023: స్టీవ్ స్మిత్ ఖాతాలో చెత్త రికార్డు.. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి!
‘ఇండో-పాక్‌ల మధ్య సిరీస్‌లు ఉంటేనే తీవ్ర పోటీ ఉంటుందని మేం చెబుతుంటాం. కానీ ఈ ఆటతీరు చూశాక ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ పోటాపోటీగా ఉంటుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కీలక మ్యాచ్‌లో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా బాగా బౌలింగ్ చేశారు. పాక్ జట్టులో షహీన్ ఆఫ్రిది బృందానికి భారత్ బౌలింగ్‌కు ఉన్న ప్రధాన తేడా ఇక్కడే తెలిసింది. ఎలాంటి కెప్టెన్‌కు అయినా కుల్దీప్, బుమ్రా వంటి బౌలర్లు అందుబాటులో ఉంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటీవల బుమ్రా-షహీన్ మధ్య పోలిక పెడుతున్నారు. మ్యాచ్‌లో బుమ్రా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంచి ఎండ ఉండగా బౌలింగ్ వేసి బ్యాటర్లను కట్టడి చేశాడు’ అని గౌతీ చెప్పారు.