Ganta Srinivasa Rao: ఎన్ని కుప్పిగంతులు వేసినా రాష్ట్రంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణం తీరిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేవారు మాజీ మంత్రి, టీడీసీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు.. YSRCP ప్రభుత్వానికి అంతిమ గడియలు వచ్చాయి.. నోటిఫికేషన్ కొద్ది రోజులు ముందు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం ఒక డ్రామాగా కొట్టిపారేశారు. విశాఖ ప్రజలు జగన్, వైసీపీని నమ్మడం లేదని 2014, 2019, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయమే నిదర్శనంగా పేర్కొన్న ఆయన.. బస్ బే, ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేయలేని ప్రభుత్వం.. రాజధాని ఎలా నిర్మించ గలదో చెప్పాలని డిమాండ్ చేశారు..
విశాఖలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 హెలిప్యాడ్ నిర్మాణం తప్ప అదనంగా వచ్చిన ఒక్క ప్రాజెక్ట్ లేదు అని దుయ్యబట్టారు గంటా.. ఎన్ని కుప్పగంతులు వేసినా రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డికి రుణం తీరిపోయిందన్న ఆయన.. జగన్మోహన్ రెడ్డి గెలిచి ప్రమాణ స్వీకారం, వైజాగ్ లో నివాసం.. ఈ రెండు జరిగే పనులు కాదన్నారు. సెక్రెటరీయెట్ తాకట్టుతోనే జగన్ ప్రభుత్వంపై విశ్వసనీయత పోయింది.. తాకట్టు పెడితే తప్పు లేదని మంత్రులు సమర్థిస్తున్నారు. వేటిని తాకట్టు పెట్టాలో కూడా విజ్ఞత వుండాలి కదా..? అని ప్రశ్నించారు. విశాఖలో డ్రీమ్ కేపిటల్ అంటున్న సీఎం జగన్ బూటకపు మాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు, భూములను తాకట్టు పెట్టిన ప్రభుత్వం.. అభివృద్ధి ఎలా సాధ్యం చేస్తారో చెప్పాలని నిలదీశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో వచ్చిన పెట్టుబడులపై చర్చించాలని డిమాండ్ చేవారు గంటా శ్రీనివాసరావు.
మరోవైపు.. మంత్రి బొత్సపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు గంటా.. చీపురుపల్లిలో తనపై పోటీ అంటే ఓడిపోవడానికి అన్న బొత్స వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన ఆయన.. ఓడిపోయిన అనుభవం బొత్సకే వుంది.. ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా బొత్స ఓడిపోయారని గుర్తుచేశారు. నేను గెలవడం తప్ప ఓడిపోవడం తెలియదు. సీట్లు ఫిక్స్ అయిన తర్వాత ఎవరు ఎక్కడ నుంచి పోటీ అనేది తేలుతుందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.