Ganga River: ప్రపంచంలో స్వచ్చతకు గంగా నది ప్రసిద్ధి చెందింది. తాజాగా ప్రముఖ శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ అజయ్ సోంకర్ చేసిన పరిశోధన ప్రకారం, గంగా నదిలో 1,100 రకాల బ్యాక్టీరియోఫేజ్‌లు సహజసిద్ధంగా ఉన్నాయని.. ఇవి నదిని కాలుష్యం నుండి రక్షిస్తూ నీటిని స్వచ్ఛంగా ఉంచుతున్నాయని వెల్లడించారు. గంగా నదిలోని ఈ సూక్ష్మజీవులు కాలుష్య కారకాలను, హానికరమైన బ్యాక్టీరియాను నిర్ములిస్తున్నాయని ఆయన ప్రకటించారు.
Read Also: Delhi Airport: అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి, బంగారం పట్టివేత
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రశంసించిన శాస్త్రవేత్త డాక్టర్ అజయ్ సోంకర్. గంగా నీటిలోని బ్యాక్టీరియోఫేజ్‌లు అత్యంత శక్తివంతమైనవిగా వ్యవహరిస్తాయని, ఇవి హానికరమైన బ్యాక్టీరియాను ఖచ్చితంగా గుర్తించి నాశనం చేసి, అవి మాయమైపోతాయని వెల్లడించారు. ఈ బ్యాక్టీరియో ఫేజ్‌లను గంగా నదికి “సెక్యూరిటీ గార్డ్‌లు” గా పరిగణించవచ్చని ఆయన అన్నారు. క్యాన్సర్, జన్యు సంకేతాలు, సెల్ బయాలజీ, ఆటోఫజీ వంటి పరిశోధనల్లో విశేష అనుభవం కలిగిన డాక్టర్ అజయ్ సోంకర్ వాజనింగెన్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి పనిచేశారు.
గంగా నదిలోని 1,100 రకాల బ్యాక్టీరియోఫేజ్‌లు హానికరమైన బ్యాక్టీరియాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వాటిని అంతమొందిస్తాయి. ఇవి సాధారణ బ్యాక్టీరియాపై 50 రెట్లు అధిక శక్తి కలిగి ఉంటాయి. బ్యాక్టీరియోఫేజ్‌లు హానికరమైన బ్యాక్టీరియాను తనలోకి చొప్పించుకుని, వాటి ఆర్ఎన్ఏను చెరిపివేసి వాటిని నాశనం చేస్తాయి. మహా కుంభమేళా సమయంలో కోట్ల మంది భక్తులు గంగా స్నానం చేసారు. ఈ సమయంలో శరీరంలో నుంచి వెలువడే సూక్ష్మజీవులను గంగా ప్రమాదకారకమైనవిగా గుర్తించి, బ్యాక్టీరియోఫేజ్‌ల ద్వారా వాటిని తక్షణమే నిర్వీర్యం చేస్తుంది.
Read Also: The EYE : వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శృతి హాసన్ హాలీవుడ్ సినిమా ‘ది ఐ’
ఈ బ్యాక్టీరియోఫేజ్‌లు హానికరమైన బ్యాక్టీరియాను తక్షణమే నాశనం చేయడమే కాకుండా, ప్రతిరోజూ 100-300 కొత్త బ్యాక్టీరియోఫేజ్‌లను ఉత్పత్తి చేస్తాయి. గంగా నదిలో ఈ ప్రక్రియ నిరంతరం సాగుతూ నదిని స్వచ్ఛంగా ఉంచుతుంది. సముద్ర నీటిలో కనిపించే సహజ శుద్ధి ప్రక్రియతో దీని పోలిక ఉంటుంది. డాక్టర్ అజయ్ సోంకర్ గంగా నదిలో కనిపించిన బ్యాక్టీరియోఫేజ్‌ల వైద్య ప్రయోజనాలను కూడా వివరించారు. ఇవి చక్కటి ఔషధ గుణాలను కలిగి ఉంటాయని, మన ఆరోగ్యానికి హానికరమైన బ్యాక్టీరియాను మాత్రమే నిర్ధారించి నాశనం చేయగలుగుతాయని తెలిపారు. ఈ విశిష్టమైన స్వశుద్ధి విధానం ప్రకృతి మనకు అందించిన గొప్ప సందేశమని, మనం ప్రకృతితో సఖ్యతగా మెలగకపోతే ప్రకృతి తన మార్గాన్ని స్వయంగా ఎంచుకుంటుందని ఆయన హెచ్చరించారు. గంగా నది తన స్వచ్ఛతను సహజసిద్ధంగా కాపాడుకోగలగడం ప్రపంచానికి ఒక గొప్ప సందేశం. ఇది మానవజాతికి ప్రకృతి అందించిన ఒక అపూర్వ వరం. కాబట్టి, మనం కూడా గంగా నదిని అలాగే ప్రకృతిని కాపాడే బాధ్యత వహించాలి.