Delhi Airport: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి పెద్ద ఎత్తున అక్రమ రవాణాను గుర్తించి స్మగ్లర్ల కుట్రను భగ్నం చేశారు. ఈ ఘటనలో మొత్తం 27 కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు విదేశీ గంజాయిని చాకచక్యంగా 54 ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్‌లలో దాచిపెట్టారు. బట్టల తరలింపుగా చూపిస్తూ.. నాలుగు ట్రాలీ బ్యాగ్‌లను పూర్తిగా గంజాయితో నింపి దుబాయ్ నుండి ఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్ సమయంలో గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయ్యింది.
Read Also: Telangana MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే..
ఈ కేసులో థాయ్‌లాండ్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన అధికారులు, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో డ్రగ్స్ తరలింపుకు బదులుగా విదేశీ గంజాయిని అక్రమంగా భారత్‌కు తరలించే ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి. అందుకే విదేశాల నుండి ఢిల్లీకి వచ్చే ప్రతి ప్రయాణికుడిపై కస్టమ్స్ బృందం ప్రత్యేక నిఘా పెట్టింది. మరోవైపు, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో ఆసక్తికరమైన బంగారం స్మగ్లింగ్ ప్రయత్నం విఫలమైంది. కస్టమ్స్ అధికారులు 172 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Read Also: MLC Elections: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నేడే పోలింగ్
ఒక స్మగ్లర్ ఎలాంటి అనుమానం రాకుండా బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఖర్జూరం పండ్లలో కలిపివేసి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న మెటల్ డిటెక్టర్‌లో అసలు విషయం బయట పడింది. ఈ స్మగ్లర్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని, కస్టమ్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాదకద్రవ్యాలు, బంగారం వంటి విలువైన వస్తువుల స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు కస్టమ్స్ అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ తరహా అక్రమ రవాణా ఘటనలు పెరుగుతుండటంతో ప్రతి ప్రయాణికుడిపై ప్రత్యేక దృష్టిని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గత కొన్ని నెలలుగా ఢిల్లీ విమానాశ్రయంలో మాదక ద్రవ్యాలు, బంగారం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అధికారులు విజయవంతంగా పని చేస్తున్నారు.