Vizag: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి. గణేష్ మండపాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని భక్తులు పూజలను నిర్వహిస్తున్నారు. విశాఖనగరంలో భారీగా గణనాథులు కొలువుదీరారు. గాజువాక బస్ డిపో పక్కన 75 అడుగుల ఎత్తు బెల్లం వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 20 టన్నుల బెల్లంతో గణపతిని తయారుచేశారు. పూజలా అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. బెల్లం వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు.
బెల్లం దిమ్మెలను క్రమపద్ధతిలో అమర్చుతూ భారీ ఆకారాన్ని తీర్చిదిద్దారు. అనకాపల్లికి చెందిన శిల్పులు రెండు నెలలకు పైగా కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందు కోసం అవసరమైన బెల్లం రాజస్ధాన్ నుంచి రప్పించారు. 21 రోజుల పాటు భక్తుల దర్శనాలక అను గుణంగా ఈ మండపం రూపొందింది. స్ధానికంగా లభించే బెల్లం వాతావరణ పరిస్ధితులకు తట్టుకుని నిలబడదని గుర్తించి రాజస్ధాన్ నుంచి తెప్పించారు. అక్కడ తయారయ్యే బెల్లం రాజస్ధాన్ లో వుండే వేడి వాతావరణకు తట్టుకుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ వుంటుంది కనుక ఇంపోర్ట్ చేసుకుని బెల్లంతో ఈ భారీ గణనాథుడిని సిద్ధం చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.. భారీ బెల్లం గణనాథుడు ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే.. అందుకు పాటించిన జాగ్రత్తలు చాలా ప్రధానంగా చెప్పుకోవాలి… గత ఏడాది గాజువాకలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహం కొద్దిరోజులకే ప్రమాద భరితంగా మారింది. దీంతో యంత్రాంగం తక్షణం నిమజ్జనం చెయ్యాలని పట్టుబట్టి ఆ తంతు పూర్తి చేయించింది.. కానీ, ఇప్పుడు గాజువాకలో పోటాపోటీ విగ్రహాలు రెడీ అయ్యాయి. వీటిలో బెల్లం గణపతి బరువు ఎక్కువ. దీంతో నమూనా సిద్ధం చేసిన దగ్గర నుంచి విగ్రహం రెడీ అయ్యే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వహకులు చెబుతున్నారు. అ గాజువాక శ్రీనగర్ పరిధిలో మరో 89 అడుగుల విగ్రహం వెలిసింది. ఈ సారి చవితి వేడుకల్లో అయోధ్య రామమందిరం, కల్కి, పుష్ప సినిమా హీరోల అవతారంలో వినాయకుడు దర్శనం ఇవ్వనున్నాడు.
Read Also: Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ వేలంలో ఈ ఏడాది ఒక కొత్త రూల్.. ఏంటో తెలుసా?
ఎన్టీఆర్ కలెక్టరేట్ ప్రాంగణంలోనే సీఎం చంద్రబాబు వినాయక చవితి వేడుకలు నిర్వహించనున్నారు. వారం రోజుల నుంచి ఎన్టీఆర్ కలెక్టరేట్ ప్రాంగణంలోనే మకాం వేసి వరద సహయక చర్యలపై సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ కలెక్టరేట్ ప్రాంగణంలోనే వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని సీఎం నిర్ణయించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే వినాయక పూజకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా.. వినాయక చవితిపై వరద ప్రభావం పడింది. వరద ప్రభావిత ప్రాంతంలోనూ వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి. వినాయక చవితి పండుగ పూజా సామాగ్రి అమ్మకాలు కొనసాగుతున్నాయి. వరద ఎఫెక్ట్‌తో మందకొడిగా ఉందని దుకాణాదారులు పేర్కొంటున్నారు.
కడప జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కడపలో గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. కడపలో ఎక్కడ చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి. గణేష్ మండపాల వద్ద పెద్ద ఎత్తున చేరుకుని పూజలను భక్తులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు జరుగుతున్నాయి. వాడ వాడలా గణేశునికి పూజలు నిర్వహిస్తున్నారు. పాత గుంటూరులోని శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తు్న్నారు. ఉదయం నుండి ఆలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. వినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు,హోమాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు శ్రీ గుంటి విఘ్నేశ్వర ఆలయంలో 9 రోజులపాటు జరగనున్న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.