హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్శిటీలో ఆకతాయిల అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. అక్కడ విద్యార్థులు ఉంటారు.. చదువుకుంటారు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. పైగా అలాంటి వారిని ప్రశ్నిస్తే.. అచ్చోసిన ఆంబోతుల్లా మీద పడి క్యాంపస్ విద్యార్థుల పైనే దాడి చేస్తున్నారు. అలాంటి ఓ ఘటనలో పోలీసులు నలుగురు అకతాయిలను అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ.. విద్యార్థులపాలిట దేవాలయం. అక్కడ చదువుకోవాలని.. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో సీట్ కోసం ఎంతో మంది విద్యార్థులు తపస్సు చేస్తుంటారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షరాలా నిజం. అలాంటి ఉస్మానియా వర్శిటీకి ఆకతాయిల తాకిడి ఎక్కువవుతోంది. నిజం చెప్పాలంటే అకతాయిల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సాధారణ జనాలకు అనుమతి ఉండడంతో ఎవరు పడితే వారు క్యాంపస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Also Read:Dulquer Salman : మా ఇండస్ట్రీలో రూ. 30 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ..
ఉస్మానియా యూనివర్శిటీ వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ క్రమంలో ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. దీంతో క్యాంపస్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో కొంత మంది వ్యక్తులు ఒక ఇన్నోవా కారు ఆపారు. అక్కడే మూత్రం పోసేందుకు ప్రయత్నించారు. దీనికి ఓ విద్యార్థి అడ్డు చెప్పాడు. ఈ ప్రాంతంలో నిత్యం విద్యార్థినీ విద్యార్థులు తిరుగుతూ ఉంటారని.. ఇక్కడ అలాంటి పనులు చేయవద్దని సూచించాడు. కానీ ఆ ఆకతాయలు వినలేదు. పైగా మాకే నీతులు చెబుతావా అంటూ వాగ్వాదానికి దిగారు.
అంతటితో ఊరుకోలేదు ఆ ఆకతాయిలు. విద్యార్థిపై చేయి చేసుకున్నారు. పైగా తాము ఐఏఎస్ అధికారులమని, నేషనల్ హైవే అథారిటీ కోసం పని చేస్తున్నామని, నేషనల్ హైవే సర్వే కోసం వచ్చామని చెప్పుకొచ్చారు. అలాంటి తమనే అడ్డుకుంటావా.. అంటూ విద్యార్థిపై దాడి చేశారు. పరుగులు పెట్టించి మరీ కొట్టారు. అయితే విద్యార్థిని కొడుతుంటే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి రావడంతో వాళ్లందరూ పరారయ్యే ప్రయత్నం చేశారు. తోటి విద్యార్థులంతా కలిసి నలుగురిని పట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు అప్పగించారు.
Also Read:Ghaati : ఘాటీ ఇన్ సైడ్ టాక్.. ‘స్వీటీ’ అంటే ‘స్వీట్’ అనుకుంటివా?
ఇక పోలీసుల ఎదుట కూడా ఆకతాయిలు రెచ్చిపోయారు. తాము ఐఏఎస్ అధికారులమని బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. ఐఏఎస్ అధికారులమని చెప్పుకొని.. వీళ్లు దందాలు చేస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా ఐఏఎస్ అధికారులమంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే అథారిటీ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా యూనివర్సిటీలో అసభ్యకర రీతిలో వ్యవహరించడంతోపాటు విద్యార్థిపై దాడి చేసినందుకు మరో రెండు సెక్షన్లు జోడించి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ పంపారు.