Ambati Rambabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ఏపీలో పోలీస్ వ్యవస్థ తీరును అద్దం పట్టేలా ఉన్నాయన్నారు. పోలీసు వ్యవస్థ , హోం శాఖపై డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారని.. ఈరోజు స్వయంగా డిప్యూటీ సీఎం హోంశాఖ విఫలమైందని చెప్పారన్నారు. బయటికి వెళ్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారని, డీజీపీకి డిప్యూటీ సీఎం చెప్పుకుంటున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా లేదని డిప్యూటీ సీఎం చెబుతున్నారని.. ఈ విషయం మేము రెండు నెలల క్రితమే చెప్పామన్నారు.
Read Also: CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
రాష్ట్రంలో చిన్న పిల్లలను హత్య చేస్తున్నారు.. మహిళలపై అత్యాచారాలు, దారుణాలు పెరిగిపోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 33,000 మంది మహిళలు ఆచూకీ లేరని గతంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని.. మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క మహిళనైనా తీసుకొచ్చారా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. నేరాలు చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని.. పవన్ కల్యాణ్ చెప్పినట్లు మడత పెట్టి కొట్టకూడదన్నారు. పోలీసులు నిర్లిప్తంగా ఉన్నారు, అసమర్థంగా ఉన్నారని ఐదు మాసాల పరిపాలన తర్వాత కూడా మీరు చెప్తున్నారంటే, మీకు పరిపాలన చేతగానట్లే అర్థమవుతుందన్నారు. పవన్ కల్యాణ్ హోంమంత్రి ఐతే ఏం జరుగుతుందని ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడో అది చేస్తాడంట… పవన్ నువ్వు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. నువ్వు హోం మంత్రి కాకపోతే సీఎం అవ్వు …ప్రజలు అనుకుంటే ఏకచిత్రాధిపత్యం సాగించిన ఇందిరా గాంధీకి ఓటమి తప్పలేదు… ప్రజలు తలుచుకుంటే మీ కూటమి ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయమన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ ఊగిపోతూ మాట్లాడితే ఏం జరుగుతుందంటూ ఎద్దేవా చేశారు.
ప్రస్తుత హోం మంత్రి మైక్ ముందే హోం మంత్రి అంటూ విమర్శించారు. పోలీస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసే అధికారం కూడా ఆమెకు లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తెనాలిలో మీ కూటమి నాయకుడు ఒక దళిత మహిళపై అరాచకం చేసి , హత్య చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తే లా అండ్ ఆర్డర్ మెయింటన్ అవుతుందా అంటూ వ్యాఖ్యానించారు. పోలీస్ అధికారులు చట్టప్రకారం ప్రవర్తించకపోతే కాలం మిమ్మల్ని వెంటాడుతుందన్నారు. సోషల్ మీడియాలో హద్దు అదుపు లేకుండా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మా పార్టీకి చెందిన మహిళ మాజీ మంత్రి పై ఇష్టారాజ్యంగా కామెంట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక, 78 మంది మహిళలు, యువతులపై దాడులు జరిగాయన్నారు. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.