జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ రోడ్డులోని ‘జై భవాని’ హార్డ్ వేర్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. ఫైర్ సిబ్బంది వెంటనే అలెర్ట్ అయింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని జనగామ పట్టణ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Shubman Gill Record: ప్రపంచంలోనే మొదటి బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు!
అగ్ని ప్రమాదంలో ‘జై భవాని’ దుకాణం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక వాహనాలు వచ్చే సరికి షాపులోని విలువైన పరికరాలు, సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరగడంతో దుకాణ యజమాని కన్నీటి పర్యంతమయ్యారు. భారీగా మంటలు చెలరేగడంతో షాపు దగ్గరలోని ఇళ్లలో ఉన్న ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్నీ జనగామ డీపీసీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ చేతన్ నితిన్, సీఐ దామోదర్ రెడ్డిలు పరిశీలించారు.