చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో జరుగుతున్న దారుణాలు రోజుకొక్కటి బయటపడుతూనే ఉన్నాయి. స్టార్ అవ్వాలనే కలతో వచ్చిన అమ్మాయిలను అవకాశాలు ఇస్తామని మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి సంఘటనల్లో తాజాగా ఒకటి షాకింగ్‌గా మారింది. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని నమ్మించి ఒక మైనర్ బాలికపై అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి, అకౌంటెంట్ అనిల్ దీర్ఘకాలంగా లైంగిక దాడికి పాల్పడినట్లు బయటపడింది. ఇండస్ట్రీలో పేరున్న వాళ్లమని చెప్పుకుంటూ, ఆమె బలహీనతను, ఆశలను వాడుకుని పదేపదే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది.
Also Read : Akhanda : ‘అఖండ 3’ టైటిల్ లీక్.. బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
కాగా మాయ మాటలు చెప్పి హీరోయిన్ చేస్తాం, ఇండస్ట్రీలో సెటిల్ చేస్తామని నమ్మబలికిన ఈ ఇద్దరూ, పలుమార్లు ఆమెపై దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఇక ఈ విషయం బయటపెడుతుందనే భయంతో ఆమెను బెదిరించారట. అయితే ఇక భరించలేకపోయిన ఆ అమ్మాయి ధైర్యం చేసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న ఫిల్మ్‌నగర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, శివారెడ్డి మరియు అనిల్‌లను POCSO చట్టం కింద అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. సినిమాల్లో ఛాన్స్ పేరుతో మైనర్‌లను ఇలా ట్రాప్ చేసే ఘటనలకు చెక్ పెట్టాలంటూ పలువురు స్పందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.