Jobs Scam Busted: దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ విదేశీ ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టర్కీ, ఇథియోపియాలోని ప్రముఖ విదేశీ సంస్థల్లో అధిక వేతనంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి 100 మందికి పైగా మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఢిల్లీ పోలీసులు మొదట 33 ఏళ్ల సోహైల్ నిజాంను అరెస్టు చేశారు. అనంతరం అతని సహచరులు అఫ్రోజ్ ఆలం(32), పర్వేజ్ ఆలం(42) అరెస్ట్ చేసినట్లు వారు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తులు విలాసవంతమైన జీవనశైలిని గడపాలని కోరుకున్నారు. ‘ఏఆర్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో నకిలీ కంపెనీని ఏర్పాటు చేసి నేరాల మార్గాన్ని ఎంచుకున్నారు. వారు సోషల్ మీడియాలో సంస్థ గురించి ప్రచారం చేసి, నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. అక్కడ వారు ఎప్పుడూ లేని విదేశీ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటనలను ఉంచారని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు టర్కీ, ఇథియోపియాలోని ప్రముఖ విదేశీ సంస్థల్లో అధిక వేతనం పొందుతున్న ఉద్యోగాల గురించి తమ వెబ్‌సైట్‌లో నకిలీ వివరాలను పోస్ట్ చేశారని, చెల్లింపులకు బదులుగా వారి బాధితులకు వాట్సాప్ ద్వారా నకిలీ జాబ్ ఆఫర్ లెటర్‌లను పంపారని పోలీసులకు చెప్పారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ డియో తెలిపారు. నిందితులు బాధితుల పాస్‌పోర్టులను కూడా తమ వద్ద ఉంచుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 68 భారతీయ పాస్‌పోర్టులు, చైనా కంపెనీకి చెందిన నకిలీ జాబ్ ఆఫర్ లెటర్‌లు, టర్కీ, ఇథియోపియా దేశాల నకిలీ విమాన టికెట్ల కాపీలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
Read Also: Youtube Fraud: యూట్యూబ్ చానల్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో భారీ మోసం.. మహిళకు రూ.8 లక్షల టోకరా
టర్కీ, ఇథియోపియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏఆర్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన వ్యక్తులు తనను మోసం చేశారని దిలావర్ సింగ్ అనే వ్యక్తి సరితా విహార్ పోలీస్ స్టేషన్‌ను ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమకు డబ్బు చెల్లించిన తర్వాత నిందితులు తనకు నకిలీ ఈ-వీసా, జాబ్ ఆఫర్ లెటర్, విమాన టిక్కెట్‌ను పంపించారని దిలావర్ సింగ్ చెప్పారు. వెంటనే, వారు అతని కాల్స్ తీసుకోవడం మానేశారని పోలీసులు తెలిపారు. అతని ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420, 468, 467, 471 – ఫోర్జరీ, చీటింగ్‌కు సంబంధించిన – సెక్షన్ 24, వలస చట్టంలోని సెక్షన్ 24 కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.”సాంకేతిక నిఘా, బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా, పోలీసు బృందం సోహైల్ నిజాంను పట్టుకుంది. విచారణ సమయంలో అతను తన నేరాన్ని అంగీకరించాడు. అతని సహచరులు అఫ్రోజ్ ఆలం, పర్వేజ్ ఆలం వరుసగా వారి నివాసాల్లో పట్టుబడ్డారు,” అని డీసీపీ చెప్పారు. రూ.50-60 లక్షల రూపాయల మోసాలకు పాల్పడిన వారి బ్యాంకు ఖాతాను కూడా స్తంభింపజేసినట్లు పోలీసులు తెలిపారు. వారి ఇతర సహచరులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.