Imran khan: పాకిస్తాన్‌లో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారంనాడు లాంగ్ మార్చ్ ప్రారంభించారు. అసలే సంక్షోభంలో ఉన్న పాక్ పాలకులపై ఇమ్రాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ మరింత ఒత్తిడి పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లాహార్ నుంచి ఇస్లామాబాద్ వరకూ 380 కిలోమీటర్లు సాగే ఈ లాంగ్‌మార్చ్‌లో వేలాది మంది ప్రజలు వచ్చి చేరనున్నారని, మార్గమధ్యంలో పలు ర్యాలీలు నిర్వహిస్తామని ఇమ్రాన్ వర్గీయులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. క్రికెటర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన ఇమ్రాన్ ఖాన్, భారీ ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్‌ను మరోసారి కొనియాడారు. రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొనుగోలు చేసిన భారత విదేశాంగ విధానాన్ని ఆయన మెచ్చుకున్నారు.
Read Also: Colour Change Dress: ఎండకు రంగులు మారే వెరైటీ డ్రెస్
కూటమి భాగస్వాములు కొందరు ఫిరాయింపులకు పాల్పడటంతో గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానంలో ఖాన్ ఓటమి పాలై అధికారం కోల్పోయారు. అయినప్పటికీ పబ్లిక్‌లో ఆయనకున్న ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదు.ఇమ్రాన్ లాంగ్‌మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలకమైన కూడళ్లలో వందలాది షిప్పింగ్ కంటైనర్లు ఉంచారు. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నాలు జరిగినట్లయితే ప్రదర్శకులను అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేశారు. గత మేలో ఇదే తరహా నిరసన ప్రదర్శనల్లో ఖాన్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి.
కాగా, అరెస్టులతో సహా దేనికీ తాను భయపడేది లేదని ఇమ్రాన్ ఖాన్ గురువారం రాత్రి ఒక వీడియో సందేశంలో తెలిపారు. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారని, స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించాలన్నదే వారి అభిమతమని అన్నారు. ఖాన్ ఇటీవల కాలంలో పలు ప్రదర్శనలు నిర్వహిస్తూ తన పాపులారీటీ తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. జనం సైతం ఆయన ర్యాలీలకు పెద్దఎత్తున హాజరవుతున్నారు. ఇటీవల జరిగి ఆరు ఉప ఎన్నికల్లో ఖాన్ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకుంది.
Read Also: Nurse Behaviour with Patient: జుట్టు పట్టుకుని బెడ్ పైకి తోసి ఇంజక్షన్ చేసిన నర్స్
కాగా, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ అయిన ఇమ్రాన్ ఖాన్, భారత్‌ను పొగడం ఇదే తొలిసారి కాదు. ప్రధాని పదవి నుంచి వైదొలగిన తర్వాత ఆయన పలుసార్లు భారత విదేశాంగ విధానాన్ని కొనియాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గని భారత్, రష్యా నుంచి చౌకగా చమురును కొనుగోలు చేసిందని, స్వేచ్ఛాయుత దేశమంటే అలా ఉండాలంటూ కితాబు ఇచ్చారు.