ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామాపై మాజీ మంత్రి విడదల రజని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉండాలని, ఇలా రాజీనామాపై చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్న అరాచకాలు శాసనమండలిలో ప్రశ్నించి ఉంటే.. ఆయనకు మరింత గౌరవం పెరిగి ఉండేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశానుసారం గత ఎన్నికల్లో తాను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశానని తెలిపారు. ఇంతవరకు గుంటూరు వెస్టులో వైసీపీ గెలవలేదని, అక్కడ పార్టీ జెండా ఎగుర వేద్దామనే పోటీ చేశానని విడదల రజని స్పష్టం చేశారు.
గుంటూరులో మాజీ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడుతూ… ‘మర్రి రాజశేఖర్‌కు వైసీపీలో తగిన ప్రాధాన్యత ఇచ్చాం. ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ భాద్యతలు కూడా రాజశేఖర్‌కు ఇచ్చారు. దివంగత నేత వైఎస్ఆర్, ఆ తర్వాత వైఎస్ జగన్ ఆయనకు చాలా గౌరవం ఇచ్చారు. 2014లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆయన ఓడినా పార్టీ అధ్యక్ష పదవి కొనసాగించారు. 2019లో పార్టీలో జరిగిన పరిణామాలు ఆయనకు పూర్తిగా తెలుసు. 2019లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసే అవకాశం నాకు దక్కింది. మొట్టమొదటిసారి 2019లో వైసీపీ జెండా ఎగురవేశాం. పార్టీ గెలుపుకు ప్రతీ కార్యకర్త కష్టమే కారణం. ఆ తర్వాత పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవిని రాజశేఖర్‌కు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీగా ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉండాలి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్న అరాచకాలు మండలిలో ప్రశ్నించి ఉంటే ఆయనకు ఎంత గౌరవం పెరిగి ఉండేది. ఈ రాజీనామా ఆమోదం పొందితే ఇది టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది’ అని అన్నారు.
‘2024 ఏమైంది అనే స్పష్టత నేను అందరికీ ఇవ్వాలి. గత ఎన్నికల వ్యూహంలో భాగంగా నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించారు. మా పార్టీ అధినేత ఆదేశానుసారం నేను అక్కడకు వెళ్లి పోటీ చేశా. ఇంతవరకు గుంటూరు వెస్ట్ లో వైసీపీ గెలవలేదు. అక్కడ పార్టీ జెండా ఎగుర వేద్దామనే పోటీ చేశా. నా సొంత నియోజకవర్గాన్ని వదిలి వెళ్లటం బాధగానే ఉన్నా వెళ్ళాల్సి వచ్చింది. నా సొంత నియోజకవర్గాన్ని వదిలి వెళ్లటం బాధగా అనిపించినా మా అధినేత మాట కోసం వెళ్లా. పదే పదే నేను అక్కడకు వెళ్లి ఓడిపోయానని మర్రి రాజశేఖర్ విమర్శించారు. గెలుపు, ఓటముల గురించి మీరు మాట్లాడుతున్నారా?. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. మంచి చేసి ఓడిపోయామని నేను గర్వంగా చెబుతున్నా. నన్ను తిరిగి మా నాయకుడు నా నియోజకవర్గానికి పంపినందుకు సంతోషించా’ అని మంత్రి విడదల రజని చెప్పారు.