Etela Rajender: తాను గజ్వేల్ వస్తున్నా అని తెలవగానే కేసీఆర్ కామారెడ్డి పోయారని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక (మం) దుద్దెడలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తన భార్య అన్నీ అమ్ముకుందాం, అవసరం అయితే మళ్ళీ కొంగు నడుంకి కట్టి పనిచేస్తా.. నువ్వు మాత్రం కేసీఆర్ మీద కొట్లాట ఆపవద్దు అని చెప్పిందని ఈటల తెలిపారు. దిక్కులేక గజ్వేల్ రాలేదన్న ఈటల రాజేందర్.. బాధతో వచ్చానన్నారు. కేసీఆర్ బాధితులకు అధ్యక్షుడిని తానేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటో మీ అందరికీ తెలుసని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 170 మంది మఫ్టీ పోలీసులు ఊళ్లలో తిరుగుతున్నారట ఎవరు కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఉన్నారో చూసి కౌన్సిలింగ్ చేస్తున్నారట అంటూ ఈటల ఆరోపించారు.
Also Read: Harish Rao: ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ కాదా?
తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదని.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం భవనాలు నిర్మిస్తుందని ఈటల విమర్శించారు. గ్రామ పంచాయతీ భవనాలు, స్మశాన వాటికలు, మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిందన్నారు. కానీ నేనే కట్టాను అంటూ సీఎం కేసీఆర్ ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. చివరికి గ్రామ పంచాయితీ సిబ్బందికి కూడా ప్రధాని మోడీ డబ్బులిస్తేనే జీతాలు ఇస్తున్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు.