హుజూరాబాద్ ఉప ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతలంతా వీరలెవల్లో ఫార్మామెన్స్ చేసేస్తున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలే అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో నేతల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలు సైతం బహిర్గతం అవుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ లో చేరిన నేత కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను సీఎం కేసీఆర్ ఛాలెంజ్ గా తీసుకోవడంతో హుజూరాబాద్లో పొలికల్ హీట్ మొదలైంది. ఈటలకు హుజూరాబాద్ కంచుకోట కావడంతో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ వర్సెస్ రాజేందర్ అన్నట్లుగా మారిపోయింది.
ఇక గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరాడు. టీఆర్ఎస్ టిక్కెట్ తనకే దక్కుతుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారనే ఆడియో బయటికి రావడంతో అప్పట్లో వైరల్ అయ్యింది. ఈక్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నాటి నుంచి టీఆర్ఎస్ గెలుపు కోసం పని చేస్తున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్ కౌశిక్ రెడ్డికే దక్కుతుందని ప్రచారం జరిగినా.. చివరికీ బీసీ యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఈ సీటు దక్కింది. హుజూరాబాద్ ఉపఎన్నిక బాధ్యతలను హరీష్ రావు పర్యవేక్షిస్తుండగా కాంగ్రెస్ నుంచి కారెక్కిన కౌశిక్ రెడ్డి తన సంచలన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాడు. ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో ఆయన తనకు మద్దతు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్యాకేజ్ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశాడు. ఉప ఎన్నిక తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరుతారని చెప్పుకొచ్చాడు. అందుకే ఈటల తన ప్రచారంలో ఎక్కడ బీజేపీ పేరు వాడటం లేదని, తనను చూసే ఓటు వేయ్యాలని కోరుతున్నాడని ఆయన గుర్తుచేశాడు.
మరోవైపు సభల పేరుతో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పర్యటిస్తున్నారని అయితే ఇప్పటివరకు హుజూరాబాద్ వైపు చూడకపోవడానికి కారణం అదేనని కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దీనికితోడు ఈ ఉప ఎన్నికలో గెలుపు రాజేందర్ దేనని ఆయన చెప్పుకొస్తారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కౌశిక్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే కౌశిక్ వ్యాఖ్యలను ఈటల వర్గం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ ఓటమి లేకుండా గెలిచిన చరిత్ర ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఈటల రాజేందర్ గాలే వీస్తుందని చెబుతున్నారు. అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ నేత రేవంత్‌తో రహస్య పొత్తు ఎందుకు పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు గులాబీ బాస్ ఈ ఎన్నికల్లో ఈటలను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దళితబంధు, కొత్త రేషన్ కార్డులు, గొర్రెల పంపిణీ అంటూ హడావుడి చేస్తున్నారు. ఇదేక్రమంలో కౌశిక్ రెడ్డితో కేసీఆర్ ఇలా చెప్పించడం ద్వారా ఆయనపై వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారనే ప్రచారం సైతం విన్పిస్తోంది. కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగా సాగుతున్న ఉప ఎన్నికలో ఎవరికీ వారు వ్యూహా ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే పార్టీల మధ్య జరుగుతున్న రహస్య ఒప్పందాలు కూడా బయటికి వస్తున్నాయా? లేదంటే ఇవన్నీ ఎన్నికల జిమ్మిక్కులేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదిఏమైనా కౌశిక్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతుండటంతో ఈ విషయంపై అటు ఈటల ఇటు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.