Andhrapradesh: ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమై.. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చించింది. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పెన్షన్ బకాయిలు, ఇతర డిమాండ్లపై చర్చించింది. నాలుగు అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. పెన్షనర్లకు బకాయిలపై సమావేశంలో అడిగామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఆలస్యం చేయకుండా ఐఆర్ ఇవ్వాలని అడిగామన్నారు. జులైలోపే పీఆర్సీని సెటిల్ చేసే కొత్త సంప్రదాయనికి శ్రీకారం చుడతామన్నారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్చ జరిగిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 27న చలో విజయవాడను విరమించుకోమని ఏపీ జేఏసీ నేతలను కోరామని, నిర్ణయం సానుకూలంగా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పామన్నారు. మార్చి నెలలో లోపు బకాయిలు చెల్లింపు పూర్తి చేస్తాం అని మళ్ళీ చెప్పామన్నారు. ఐఆర్ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వ విధానం కాదని, సమయానికి పీఆర్సీ ఇస్తామన్నారు.
Read Also: Transfer of IAS: తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీలు
ప్రభుత్వంతో చర్చల తరవాత ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాస్ మాట్లాడారు. 49 డిమాండ్లను ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఫిబ్రవరి 14 నుంచి ఉద్యమ కార్యచరణ ఇచ్చామని.. ఈ నెల 27న చలో విజయవాడకు పిలుపునిచ్చామన్నారు. 30 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరాం.. కానీ PRC షెడ్యూలు ప్రకారం ఇస్తాం అని చెప్పారనన్నారు. ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది.. ప్రభుత్వం లిఖిత పూర్వకంగా మా డిమాండ్‌లపై హామీ ఇస్తే ఉద్యమ కార్యాచరణపై పునరాలోచన చేస్తామన్నారు. ఒక వేళ లిఖితపూర్వక హామీ ఇస్తే, జేఏసీ సమావేశం పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం చలో విజయవాడను విరమించుకోవాలని మమ్మల్ని కోరిందని స్పష్టం చేశారు.