Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో జూన్ 2022 రాజకీయ సంక్షోభంపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తన ఉత్తర్వును ప్రకటించింది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి పెద్ద ఊరటనిస్తూ, ఉద్ధవ్ థాకరే బలపరీక్షను ఎదుర్కోకుండా రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.”ఉద్ధవ్ రాజీనామా చేసి, బలపరీక్షను ఎదుర్కొని ఉంటే ఉపశమనం అందించబడేది. గవర్నర్ విశ్వాస పరీక్షకు పిలవకూడదు, కానీ ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసినందున, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఏక్‌నాథ్ షిండేను పిలవడం సమర్థించబడుతోంది” అని కోర్టు పేర్కొంది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కోర్టు ప్రస్తావించింది. శివసేన ఉద్ధవ్ వర్గం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం విచారణ జరిపింది. పార్టీల వివాదం పరిష్కారానికి విశ్వాస పరీక్ష ఒక్కటే మార్గం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణపై ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం వెల్లడించింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. అయితే గతేడాది జూన్ 30న బల నిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశించటం సమర్థనీయం కాదని….అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. నబం రేజియా జడ్జిమెంట్, అనర్హత పిటిషన్లు పెండింగ్, స్పీకర్ పాత్ర తదితర అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
‘చీలిక వర్గానికి శివసేన అని చెప్పుకునే అధికారం లేదు. బలపరీక్ష ప్రాతిపదికన పార్టీ గుర్తు కేటాయించడం సరికాదు. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. పార్టీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ సమ్మతం కాదు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష ఎదుర్కోలేదు. తిరిగి ఆయనను సీఎంగా నియమించలేం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో మహారాష్ట్రలో షిండే సర్కార్‌కు ఢోకా లేదు. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి తీర్పు ఎదురుదెబ్బగానే భావించాలి. రాజకీయ సంక్షోభం సమయంలో స్పీకర్ ఎలాంటి పాత్రను నిర్వహించాలన్న విషయంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయం తీసుకోబోతంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుంటే కోర్టు ఆయనకు ఉపశమనం కలిగించేదని సీజేఐ తీర్పులో వెల్లడించడం విశేషం. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం మార్చి 16న తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ కేసు విచారణలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరఫున కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గం తరఫున హరీశ్ సాల్వే, ఎన్‌కే కౌల్, మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు.
Read Also: Supreme Court: కేజ్రీవాల్ సర్కారుకు బిగ్ రిలీఫ్.. ఢిల్లీ పాలనా వ్యవహారాలపై సుప్రీం కీలక తీర్పు
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి పదవిని పంచుకునే అంశంపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో బంధాన్ని తెంచుకుంది. థాక్రే తర్వాత రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కాంగ్రెస్‌తో జతకట్టారు.ఏక్‌నాథ్ షిండే, 39 మంది ఇతర శాసనసభ్యులు సేన నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో గత ఏడాది మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. జూన్ 30న, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్ షిండే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.