Supreme Court: ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పుతో కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఢిల్లీ సర్కారుకు అధికారాలు లేవన్న గత తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ జనరల్ కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది. వాస్తవ అధికారాలు ఎన్నికైన ప్రభుత్వానికే ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వానికి సేవలపై శాసన, కార్యనిర్వాహక అధికారం ఉంది. 2019లో జస్టిస్ అశోక్ భూషణ్ తీసుకున్న నిర్ణయంతో మేము ఏకీభవించబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. 2019లో జస్టిస్ భూషణ్ పూర్తిగా కేంద్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
ఢిల్లీ పాలనా వ్యవహారాలపై నియంత్రణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వును చదువుతున్నప్పుడు.. ఢిల్లీ శాసనసభ సభ్యులు, ఇతర శాసనసభల మాదిరిగానే ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతారని సుప్రీంకోర్టు పేర్కొంది. సమాఖ్య నిర్మాణం పట్ల ప్రజాస్వామ్యం, గౌరవం ఉండేలా చూడాలి. అయితే, ఆర్టికల్ 239ఏఏ ఢిల్లీ అసెంబ్లీకి అనేక అధికారాలను కల్పిస్తుందని, అయితే కేంద్రంతో సమతుల్యత సాధించిందని కోర్టు పేర్కొంది. ఢిల్లీ వ్యవహారాల్లో పార్లమెంటుకు కూడా అధికారం ఉంది.
Read Also: WhatsApp scam: బీ అలర్ట్.. వాట్సప్ కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి
అయితే కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఢిల్లీ సర్కారు తరఫున సీనియర్ న్యాయవాది సింఘ్వీ వాదనలను విన్న తర్వాత జనవరి 18న తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. గురువారం ఆ తీర్పును వెలువరించింది. గత కొంతకాలంగా కేంద్రానికి, ఢిల్లీ అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వం మధ్య ఎడతెగని వివాదం నడుస్తోంది. అంతేకాకుండా కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అడ్డుపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ తీర్పుతో ఆ వివాదం ముగిసినట్లు అయింది.